JEE Main Results: జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ర్యాంకుల ప్రకటన ఎప్పుడంటే?
JEE Main: జేఈఈ మెయిన్ సెషన్-2 ఫైనల్ 'కీ'ని ఏప్రిల్ 18న విడుదలచేసింది. ఇక, జేఈఈ మెయిన్ ఫలితాలను ఏప్రిల్ 19న వెల్లడించనున్నట్లు స్పష్టంచేసింది.
JEE Mains 2025 Results: జేఈఈ మెయిన్ ఫలితాలపై విద్యార్థుల్లో అయోమయం నెలకొనడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తాజాగా స్పందించింది. జేఈఈ మెయిన్ సెషన్-2 ఫైనల్ 'కీ'ని ఏప్రిల్ 18న విడుదలచేసింది. ఇక, జేఈఈ మెయిన్ ఫలితాలను ఏప్రిల్ 19న వెల్లడించనున్నట్లు స్పష్టంచేసింది. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. అంతకు ముందు ఏప్రిల్ 17న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జేఈఈ మెయిన్ తుదివిడత ఫైనల్ కీని వెల్లడించిన ఎన్‌టీఏ.. ఆ తర్వాత గంటలోనే దాన్ని వెబ్‌సైట్ నుంచి తొలగించింది. దీంతో ఫలితాలపై విద్యార్థుల్లో సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్‌టీఏ స్పష్టతనిచ్చింది. జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్ సెషన్-1లో 10 షిఫ్ట్‌ల(10 ప్రశ్నపత్రాలు)లో ప్రిలిమినరీ, ఫైనల్ కీ మధ్య 13 ప్రశ్నలకు జవాబులు మారాయి. అందులో 6 ప్రశ్నలను ఎన్టీఏ విరమించుకుంది.
ఇక సెషన్-2 పరీక్షల్లో 10 షిఫ్ట్‌ల్లో 12 ప్రశ్నలకు జవాబులు మారాయి. అందులో ఒక ప్రశ్నను విరమించుకుంది. అయితే ఫైనల్ కీపై పలువురు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఈమెయిల్స్ పంపించారు. దీంతో ఎన్‌టీఏ తుది కీ పెట్టిన గంటలోనే తొలగించింది. ఈ విషయాన్ని అధికారికంగా వెబ్‌సైట్‌లో ప్రకటించకపోవడంపై విమర్శలు వచ్చాయి.
Just In
జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు ఫిబ్రవరిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక సెషన్-2 ఫలితాలు ఏప్రిల్ 17న విడుదల కావాల్సి ఉండగా.. వెల్లడికాలేదు. జేఈఈ మెయిన్ పరీక్షల్లో రెండు విడతల్లో విద్యార్థులు కనబరచిని ప్రతిభ ఆధారంగా ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ఎన్టీఏ కేటాయించనుంది. కేటగిరీల వారీగా కటాఫ్ స్కోర్‌ను నిర్ణయించి సెషన్ 1, 2లో అర్హత సాధించిన మొత్తం 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్లు ప్రకటించనుంది. వారు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 18న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నారు.
దేశంలోని 31 ఎన్‌ఐటీల్లో గతేడాది సుమారు 24 వేల సీట్లు;23 ఐఐటీల్లో 17,600 సీట్లు; ట్రిపుల్‌ఐటీల్లో దాదాపు 8,500 సీట్లు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో 57 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన ప్రతి 100 మందిలో సరాసరిన నలుగురికి మాత్రమే సీట్లు దక్కుతున్నాయి. జేఈఈ మెయిన్ చివరి విడత ముగిసిన తర్వాత రెండిటిలో ఉత్తమ స్కోర్ (రెండూ రాస్తే)ను పరిగణనలోకి తీసుకొని ఏప్రిల్ 17న రాత్రికి ప్రకటించే అవకాశం ఉంది.
మే 2 వరకు దరఖాస్తులకు అవకాశం..
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
పరీక్ష విధానం: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఒక్కోక్కటి మూడు గంటల వ్యవధి ఉంటుంది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు; పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు పేపర్లూ రాయడం తప్పనిసరి. రెండు పేపర్లలోనూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.