Southwest Monsoon: గత ఏడాదితో పోల్చితే వారం రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కాస్త చల్లబడింది. కొన్నిచోట్ల వర్షాలు ఇంకా మొదలుకాకపోవడంతో ఉష్ణోగ్రతలు దిగి రావడం లేదు. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో శుక్రవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దక్షిణ కోస్తా ఒడిశా, పరిసర ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. రాగల రెండు రోజులలో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడా, కర్ణాటక, తమిళనాడు, విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి నైరుతి రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పల్నాడు, పాడేరు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి. పార్వతీపురం మణ్యం జిల్లాలోని సలూరు వైపు తీవ్రమైన పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ వర్షాలు నేరుగా బొబ్బిలి, పార్వతీపురం టౌన్ మీదుగా ఒడిషా వైపు విస్తరిస్తున్నాయి. విజయవాడతో పాటుగా ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అర్ధరాత్రి సమయం నుంచి విజయవాడ ఏలూరు జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. కడప జిల్లాలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా కడప జిల్లా తొండూరులో 118 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఏలూరు జిల్లాలోని చాలా భాగాలు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడంలో విసారంగా వర్షాలు కురవనున్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఏర్పడుతున్న భారీ మేఘాల వల్ల సత్య సాయి, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. కడప, చిత్తూరు జిల్లాల్లోనూ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ప్రాంతాల్లో గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. కడప, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం జిల్లాల్లొ విస్తారంగా వర్షాలు కురిశాయి.
తెలంగాణలో వర్షాలు
నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత ఏడాది జూన్ తొలి వారంలో వచ్చిన రుతుపవనాలు ఈ ఏడాది రెండో వారం తరువాత తెలంగాణలో ప్రవేశించాయి. మరికొన్ని గంటల్లో ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో మరికొన్ని గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయి. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.