సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల చెలరేగిన ఆందోళన, హింసతో తెలంగాణలోని ఇతర రైల్వేస్టేషన్లు, ఏపీలోని విజయవాడ సహా మిగతా రైల్వే స్టేషన్లలో అలెర్ట్ ప్రకటించారు. నిన్నటివరకూ శాంతియుతంగా జరిగిన అగ్నిపథ్ నిరసన నేడు తీవ్రరూపం దాల్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. చివరకు కాల్పులకు సైతం దారితీసింది. ఇదివరకే తెలంగాణలో నాంపల్లి రైల్వేష్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలో రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రైల్వేస్టేషన్లకు రప్పించి భద్రతను పెంచుతున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
ఏపీలో హై అలర్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చెలరేగిన హింసతో ఏపీలోని విజయవాడ సహా ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు. గుంటూరు, నరసరావుపేట, విశాఖపట్నం, తిరుపతి, సామర్లకోట, నెల్లూరు రైల్వే స్టేషన్లలో అలెర్ట్ ప్రకటించారు. రైల్వే స్టేషన్లలో ప్రజలు గుమిగూడకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
సికింద్రాబాద్ ఘటనలో భారీ నష్టం
అగ్నిపథ్ పథకం ద్వారా రిక్రూట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు సికింద్రాబాద్‌లో చేసిన విధ్వంసంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. దాదాపు రూ.20 కోట్ల మేర నష్టం జరిగిందని సౌత్‌సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ ప్రాథమికంగా అంచనా వేశారు. సికింద్రాబాద్ ఘటనతో అప్రమత్తమైన రైల్వే అధికారులు మహబూబాబాద్, వరంగల్, ఖాజీపేట, నిజామాబాద్, డోర్నకల్ రైల్వే స్టేషన్లలో బందోబస్తు పెంచారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దేశంలోని ఇతర రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఎక్కువ నష్టం జరిగే ఉన్న రాష్ట్రాలలో రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచాలని సూచించింది.
Also Read: Agnipath Protests In Hyderabad: అగ్గి రాజేసిన ఆందోళనలు- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ధ్వంసం, పలు రైళ్లకు నిప్పు
ఉత్తరాధి రాష్ట్రాల్లో చెలరేగిన అగ్నిపథ్ వివాదం నేడు తెలంగాణలోనూ ప్రభావం చూపుతోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు ఫ్లాట్‌ఫారమ్ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. పలు రైళ్లకు నిప్పు (Train Set On Fire Secunderabad) పెట్టారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో స్టేషన్ బయట సైతం కొన్ని బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అగ్ని పథ్ పథకాన్ని రద్దు చేసి రెగ్యూలర్ గా సైన్యంలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నేటి ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు మూడు రైళ్లకు నిప్పుపెట్టారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగడంతో అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. రైల్వే స్టేషన్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.