తెలంగాణ ఉద్యమంలో యువత పోరాటం చేశారని, ఉద్యోగార్థులు కోరుతున్న విధంగా వయో పరిమితి పెంచకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పోలీస్ ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి 5 ఏళ్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాన సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు రేవంత్ రెడ్డి.


ఇటీవల వేసిన ఉద్యోగాల భర్తీలో 17 వేల పోలీస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేశారని అందులో కానిస్టేబుల్ పోస్టులు అధికంగా ఉన్నాయని, కానీ వయో పరిమితి సడలింపు కేవలం మూడేళ్లు మాత్రమే చేసారని పేర్కొన్నారు. దీని వల్ల 4 లక్షల మంది దరఖాస్తు దారులు నష్టపోయే పరిస్థితి ఉందని, ఇక్కడ ఉద్యోగాల కోసం అంత ఇబ్బందులు పడుతుంటే రాష్ట్రంలో హోమ్ మంత్రి ఉన్నాడో, లేడో తెలియదని.. మీరేమో ఫామ్ హౌస్ లో సేద తీరుతున్నారని తన లేఖలో రేవంత్ రెడ్డి హెచ్చరించారు.


తెలంగాణ ఉద్యమ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని యువత చదువును పక్కనపెట్టి మరీ ఎన్నో త్యాగాలు చేసింది. కానీ ఇప్పుడు తమ భవిష్యత్ ఏమవుతుందోనని లక్షలాది విద్యార్థులు అయోమయ స్థితిలో ఉన్నారని సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో ప్రస్తావించారు. ఉద్యోగాలు వస్తాయని మీ పార్టీ నేతలు వారికి ఆశ పెట్టారు, ఇప్పుడు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఉద్యమించాల్సిన పరిస్థితి, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత 8 ఏళ్లలో నోటిఫికేషన్ల విడుదలతో అలసత్యం ప్రదర్శించడంతో అభ్యర్థులు ఏజ్ బార్ అయ్యారు. మీరు 17 వేల పోలీస్ పోస్టులిచ్చినా, ఏజ్ బార్ కారణంగా లక్షలాది అభ్యర్థులు పోస్టులకు దూరమవుతున్నారు. 


కరోనా నేపథ్యంలో రెండేళ్లు ఇళ్లకు పరిమితం కావడం, కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. నాలుగేళ్ల తరువాత నోటిఫికేషన్ రావడం చూశాం. కానీ వయోపరిమితి కేవలం 3 ఏళ్లు పెంచడం ప్రతికూలాంశం. 4 లక్షల మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. యూపీఎస్సీ భర్తీ చేసే ఐపీఎస్ పోస్టులతో పాటు పలు రాష్ట్రాల్లో యూనిఫామ్ పోస్టులలకు గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు గా ఉంది. కనుక తెలంగాణలోనూ మరో రెండేళ్లు పెంచడం సముచితం. కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో వయోపరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 


వయోపరిమితిలో సడలింపు కోసం నిరుద్యోగులు, ఎస్పీ, డీజీపీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా మీరు స్పందించడం లేదు. ఆస్క్ కేటీఆర్ #AskKTR లో విన్నవించుకున్నా అభ్యర్థులకు ఎలాంటి సమాధానం రాలేదు. అసలు రాష్ట్రంలో హోం మంత్రి ఉన్నారో లేదో తెలియడం లేదు, సీఎం అయిన మీరు ఫామ్ హౌస్‌లో సేదతీరుతుంటారు. పరిస్థితి ఇలా ఉంటే ఉద్యోగార్థుల సమస్యలు తీర్చెదెవరు. ఉద్యోగార్థులు కోరుకున్నట్లు వయో పరిమితి పెంచకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తానని కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 


Also Read: TSLPRB Police Jobs 2022: తెలంగాణలో పోలీస్ జాబ్స్‌కు దరఖాస్తులు ప్రారంభం - డైరెక్ట్ లింక్, పోస్టుల అర్హతల వివరాలు ఇవే