Road Accident At Balakrishna House: నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద ఓ వాహనం వేగంగా దూసుకురావడంతో మంగళవారం సాయంత్రం ఘటన చోటుచేసుకుంది. అయితే వాహనం బాలకృష్ణ ఇంటి గేట్‌ను ఢీకొట్టి ఆగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Road Accident At Jubilee Hills Road Number 45: జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లో నటుడు నందమూరి బాలకృష్ణ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం యువతి నడుపుతున్న ఓ బొలెరో వాహనం ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తరువాత నటుడు బాలకృష్ణ ఇంటి గేట్ వైపునకి కారు దూసుకువచ్చింది. ఇంటి ముందు ఉన్న గేట్ ఫెన్సింగ్‌ను ఢీకొట్టి వాహనం అక్కడే నిలిచిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెనకాల వస్తున్న అంబులెన్స్‌కు దారి ఇవ్వడంలో భాగంగా వాహనాన్ని పక్కకు తీసే క్రమంలో యువతి నడుపుతున్న కారు డివైడర్ ఎక్కి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ (Actor Balakrishna) ఇంటి ముందు రోడ్డు ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా జనాలు అక్కడ భారీ సంఖ్యలో పోగయ్యారు. దాంతో అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ కాగా, ట్రాఫిక్ పోలీసులు కాసేపట్లో అంతా క్లియర్ చేసి వాహనాలను పంపించేశారు.
నటుడు బాలకృష్ణ ఇంటి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం వీడియో ఇక్కడ వీక్షించండి
యువతికి డ్రంక్ డ్రైవ్ టెస్టులు..
బొలెరో నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమైన యువతికి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. అయితే ఆల్కహాల్ శాతం జీరో వచ్చినట్లు సమాచారం. నటుడు బాలయ్య ఇంటి ముందు ఫెన్సింగ్‌లో ఇరుక్కపోయిన వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి యువతి తన వాహనాన్ని సడన్‌గా పక్కకు తిప్పగా, డివైడర్ మీద ఎక్కి దూసుకెళ్లడంతో ఘటన జరిగిందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. యువతికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.