ల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప: ది రైజ్’(Pushpa: The Rise) ఏ స్థాయిలో హిట్ కొట్టిందో తెలిసిందే. అందులో బన్నీ నటనకు దేశం మొత్తం ఫిదా అయ్యింది. ‘తగ్గేదేలే’ అంటూ ఊహించని విజయం అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ‘పుష్ప: ది రూల్’(Pushpa: The Rule) సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అంతేకాదు, దర్శకుడు సుకుమార్‌కు కూడా ఇది పెద్ద ఛాలెంజ్. 


‘పుష్ప: ది రైజ్’(Pushpa: The Rise) తర్వాత విడుదలైన పాన్ ఇండియా చిత్రాలు ‘RRR’, ‘KGF-2’ కూడా విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే, ‘పుష్ప’తో పోల్చితే ఆయా చిత్రాల విజయాలు ముందుగా ఊహించినదే. ఎందుకంటే.. ‘పుష్ప: ది రైజ్’(Pushpa: The Rise) రిలీజ్ సమయానికి అంత అంచనాలు లేవు. తెలుగులో కూడా అంతంత మాత్రంగానే టాక్ నడిచింది. అయితే, బాలీవుడ్‌లో ఎవరూ ఊహించనంతగా దూసుకెళ్లింది. ‘పుష్ప’లోని ప్రతి సీన్, డైలాగ్, సాంగ్.. ట్రెండయ్యింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప: ది రూల్’పై అంచనాలు పెరిగిపోయాయి. 


‘పుష్ప: ది రైజ్’‌(Pushpa: The Rise)ను రూ.190 కోట్ల వ్యయంతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే, రెండో పార్ట్ ‘పుష్ప: ది రూల్’(Pushpa: The Rule) బడ్జెట్ ఇంతకు రెట్టింపు ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన సుకుమార్ మే నెలలలో మళ్లీ స్క్రిప్ట్ పనిలో ఉంటారని తెలిసింది. కానీ, జూన్ నెలలోనే షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సుమారు నాలుగు నెలల సమయం పడుతుందని అంటున్నారు. అయితే, ‘పుష్ప: ది రూల్’ (Pushpa: The Rule) చిత్రం 2022, డిసెంబరు నెలలో విడుదలవుతుందని భావించారు. కానీ, ఇప్పట్లో అది సాధ్యం కాదని తెలుస్తోంది. 


సుకుమార్ గతంలో మీడియోతో చెప్పిన వివరాల ప్రకారం.. ‘పుష్ప’ సినిమా షూటింగ్ మొత్తం దాదాపు పూర్తయ్యిందని, కొన్ని సీన్లను ఫిబ్రవరి నెలలో చిత్రీకరిస్తామని తెలిపారు. చిత్రాన్ని డిసెంబరు 16, 2022న విడుదల చేస్తామని చెప్పారు. మరి, సుకుమార్ అదే మాట మీద ఉంటారా? లేదా రాజమౌళి బాట పడతారా అనేది చూడాలి. 


‘కేజీఎఫ్- చాప్టర్2’ విజయంతో సుకుమార్‌పై మరింత ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. ఇటీవలే యూఎస్ వెళ్లి వచ్చిన సుకుమార్ త్వరలోనే తన టీమ్‌తో కూర్చొని స్క్రీన్‌ప్లే పై కసరత్తులు చేయనున్నట్లు తెలిసింది. పార్ట్-2లో కొన్ని పాత్రల కోసం బాలీవుడ్ తారల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్‌లో ఎలాగైనా షూటింగ్ మొదలుపెట్టి.. 2023 జనవరి నెల కల్లా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఈ సారి ఎక్కువ సమయం తీసుకొనే అవకాశం ఉంది.


Also Watch: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!


రిలీజ్ డేట్ దగ్గరపడుతుందనే ఉద్దేశంతో ‘పుష్ప: ది రైజ్’(Pushpa: The Rise) పోస్ట్ ప్రొడక్షన్‌ను చాలా వేగంగా పూర్తి చేశారు. అయితే, పార్ట్‌-2కు మాత్రం ఆ రిస్క్ తీసుకోకూడదని చిత్రయూనిట్ భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్‌కు కనీసం 4 నెలల సమయం తీసుకొనే అవకాశాలున్నాయట. అంటే మొత్తానికి ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి సెలవులకు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ, ఫ్యాన్స్ అప్పటివరకు వేచి చూడటం అంటే చాలా కష్టం. ఇప్పటివరకు రెండో పార్ట్‌పై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఈ వార్తలు నిజమే అనిపిస్తోంది. మరోవైపు ఈ చిత్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఈ సారి హిందీ డబ్బింగ్ హక్కులను తమ వద్దే ఉంచుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సుక్కు.. మరీ ఎక్కువ రోజులు సమయాన్ని తీసుకోకుండా వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే.. ఆల్ ఓవర్ ఇండియన్ ఫ్యాన్స్ సైతం హ్యాపీ అవుతారు. మరీ ఆరు నెలల షూటింగ్, 4 నెలల పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఎక్కువ అనిపించడం లేదు? మరి దీనిపై మీరేమంటారు? 


Also Read: వరుణ్ తేజ్ సినిమాలో విలన్‌గా - తెలుగు తెరకు తమిళ్ హీరో రీఎంట్రీ