హిందీ భాషపై మొదలైన చర్చ ఇప్పట్లో ఆగేలా లేదు. కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌లతో మొదలైన ఈ రచ్చపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. ఒకే భాషకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఎవరూ అంగీకరించడం లేదు. ఇండియా అంటే భిన్న భాషలకు నెలవని, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువనే భావన ఉండకూడదని పలువురు తారలు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తమ భాష మనుగడకు ప్రమాదం ఏర్పడినప్పుడు పోరాడేందుకైనా సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. 


ఆయన నటిస్తున్న తమిళ చిత్రం ‘విక్రమ్’ ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడారు. ‘‘నేను హిందీని వ్యతిరేకించడం లేదు. అలాగని నా మాతృభాష తమిళం మనుగడకు ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. సినిమా, రాజకీయాలనేవి నాకు కవల పిల్లలాంటివి. అందుకే రెండూ చేస్తున్నా. తమిళం వర్ధిల్లాలని చెప్పడం నా బాధ్యత. ఇందుకు ఎవరు అడ్డొచ్చినా సరే ఎదుర్కొని తీరుతా. మాతృభాషను మరవద్దు. హిందీని నేను వ్యతిరేకించడం లేదు. వీలైతే గుజరాతీ, చైనీస్ భాషలు కూడా మాట్లాడండి’’ అని కమల్ తెలిపారు. 


Also Read: వరుణ్ తేజ్ సినిమాలో విలన్‌గా - తెలుగు తెరకు తమిళ్ హీరో రీఎంట్రీ


రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న ‘విక్రమ్‌’ చిత్రంలో విజయ్‌ సేతుపతి మరోసారి ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ‘పుష్ప: ది రైజ్’లో పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకున్న ఫహాద్‌ ఫాజిల్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరో సూర్య అతిథి పాత్రలో కనిపిస్తారని కమల్ హాసన్ తెలిపారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ‘మాస్టర్’తో విజయ్‌కు మాంచి హిట్ ఇచ్చిన లోకేష్‌ కనకరాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. 


Also Read: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై


‘విక్రమ్’ ట్రైలర్: