CEO Vikas Raj: తెలంగాణలో 10 లక్షల బోగస్ ఓటర్లను ఎన్నికల అధికారులు తొలగించారు. ఇందులో సగానికిపైగా గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనే ఉన్నాయి. కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి, ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. తెలంగాణలో దాదాపు 10 లక్షల మంది డూప్లికేట్ ఓట్లను తొలగించారు. ఇందులో కుత్బుల్లాపూర్‌‌లోనే వారిలో 50 వేలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, కరీంనగర్, నిజామాబాద్ అర్బన్‌లలో అత్యధికంగా నకిలీ ఓటర్లు ఉన్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెల్లడించింది.


తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల ఓటర్ల జాబితా నుంచి పేర్లను మూడు కారణాలతో తొలగించినట్లు చెప్పారు. ఒకే వ్యక్తికి రెండు, అంతకు మించి ఓట్లు ఉండడం, డూప్లికేట్ ఎంట్రీలు, వ్యక్తులు, అధికారులు, రాజకీయ పార్టీల నేతల ద్వారా నివేదించబడిన నమోదులు. ఈ సందర్భాలలో, ఓటర్ల పేరు, బంధువు పేరు, రకం, వయస్సు, లింగం, చిరునామా ఒకేలా ఉంటే ఓటు తొలగింపునకు అవకాశం ఉంటుందన్నారు. 


అలాగే ఫాం-8 ద్వారా చిరునామా మార్చుకున్నప్పుడు పాత చిరునామాలో ఉన్న పేర్లను తొలగింపు ఉంటుందన్నారు. అలాగే ఓటరు సదరు చిరునామాలో నివసించనట్లు తెలిస్తే ఓటు డిలీట్ అవుతుందన్నారు. డూప్లికేట్ ఓట్ల తొలగింపుపై విధివిధానాలు పాటించామని సీఈవో తెలిపారు. ఓటర్ల తొలగింపుకు సంబంధించి ECI సర్క్యులర్‌ను ఆయన పరిశీలించారు. అలాగే పేర్లు, చిరునామాలలోని మార్పులకు సంబంధించిన సమస్యలపై కూడా సమావేశంలో చర్చించారు. ఓటర్ల జాబితా ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు.


Also Read: యువతను ప్రోత్సహించండి


రాబోయే ఎన్నికలకు సంబంధించిన ప్రతీ ప్రతి ఫిర్యాదును జిల్లాల ఎన్నికల అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ ఆదేశించారు. అలాగే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికలను సమర్పించాలని పేర్కొన్నారు. బహదూర్‌పురా, గోషామహల్‌, నాంపల్లి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాల్లో వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేశారు. 


రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో 18 నుంచి 19 ఏళ్ల వయసు గల వారి ఓట్ల నమోదుపై దృష్టి పెట్టాలన్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు గల సముదాయాన్న, పీడబ్ల్యూడీ ఓటర్లను, ట్రాన్స్‌జెండర్లు, సెక్స్ వర్కర్ల నమోదు వందకు వంద శాతం అయ్యేలా చూడాలని కోరారు. ముఖ్యంగా 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల యువతను ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వివిధ ప్రచార పద్ధతులను పాటించాలని డీఈఓలు, ఏఆర్ఓలు, ఈఆర్ఓలకు సీఈఓ వికాస్ రాజ్ సమగ్ర సూచనలను జారీ చేశారు. 


ఓటరు భాగస్వామ్యాన్ని పెంపొందించడంతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మెరుగు పరిచేందుకు మార్గాలు అన్వేషించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. సీఈఓ కార్యాలయం, ఈసీ ద్వారా అందే ఫిర్యాదులను వెంటనే పరిశీలించి వాస్తవ నివేదికలను ఆలస్యం చేయకుండా సీఈవో కార్యాలయానికి పంపాలని డీఈవోలను ఆదేశించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం  రెడీ అవుతోంది. రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ తోపాటు తెలంగాణ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.