Centre On Caste Census: జనాభా గణన చట్టం 1948 ప్రకారం జనాభా గణనను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉందని సోమవారం కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. బిహార్‌ కుల గణనకు సంబంధించిన అంశంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం ఈ విధంగా పేర్కొంది. జనగణన అనేది చట్టబద్ధమైన ప్రక్రియం అని, చట్టం ఆధారంగానే నిర్వహించాలని తెలిపింది. ఏడో షెడ్యూల్‌ 69వ ఎంట్రీ ప్రకారం జనగణన యూనియన్‌ లిస్ట్‌లో ఉందని వెల్లడించింది. సెన్సెస్‌ యాక్ట్‌ ప్రకారం కూడా కేవలం కేంద్రానికి మాత్రమే ఈ అధికారం ఉంటుందని స్పష్టంచేసింది.రాజ్యాంగంలోని నిబంధనలు, చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఎస్‌ఈబీసీ, ఓబీసీల అభివృద్ధి కోసం తగిన చర్యలను తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది.


బిహార్‌ కులగణనకు వ్యతిరేకంగా కేంద్రం సోమవారం తొలుత దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేరా నంబర్‌ 5 లో.. రాజ్యాంగం ప్రకారం కేంద్రం కాకుండా ఇతర ఏ సంస్థకు జనగణన లేదా దానికి సమానమైన చర్యను నిర్వహించడానికి అర్హత లేదని పేర్కొంది. అయితే కొన్ని గంటల తర్వాత మరో సారి అఫిడవిట్‌ దాఖలు చేసి ఆ పేరాను తొలగించారు. ఈ పేరాపై బిహార్‌ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దానిని తీసివేశారు. బిహార్‌లో నిర్వహించిన కుల గణనను ఛాలెంజ్‌ చేస్తున్నట్లుగానే కేంద్రం అఫడవిట్‌ ఉందని అభిప్రాయపడ్డారు. 


ఇంతముందు జరిగిన విచారణలో బిహార్‌ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 6 న కుల గణన సర్వే చేపట్టి ఆగస్టు 12న డేటా అప్‌లోడ్‌ చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ సర్వే వల్ల కొన్ని పరిణామాలు ఉంటాయని కేంద్రం తరఫున వాదిస్తున్న సోలిసిటర్‌ జనరల్‌  తుషార్‌ మెహతా వెల్లడించడంతో దీనిపై స్పందనను తెలియజేయాలని కోర్టు వెల్లడించింది. దీంతో వారం తర్వాత కేంద్రం ఈ అఫిడవిట్‌ దాఖలు చేసింది. 


కేంద్రం సుప్రీంలో అఫిడవిట్‌ దాఖలు చేయడంపై బీహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ మండిపడ్డారు. వారికి ఎలాంటి నాలెడ్జ్‌ లేదని, ఎలా అబద్ధాలు చెప్పాలో, నిజాన్ని ఎలా  అణిచివేయాలో మాత్రమే తెలుసని విమర్శించారు. కుల గణను కేంద్రం అఫిడవిట్‌లోనే వ్యతిరేకించిందని స్పష్టంచేశారు. దీన్ని బట్టి బీజేపీకి కులగణన ఇష్టం లేదని స్పష్టంగా తెలిసిపోతుందని అన్నారు. ఒకవేళ వాళ్లు సపోర్ట్‌ చేస్తున్నట్లయితే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని పేర్కొన్నారు. 


బిహార్‌ మాజీ డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌, సీనియర్‌ బీజేపీ నాయకుడు సుశీల్‌ మోదీ దీనిపై స్పందించారు. తమ పార్టీ కుల గణనకు మద్దతిస్తుందని, కానీ జనగణన చట్ట ప్రకారం కుల గణన నిర్వహించే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని అన్నారు. 


బిహార్‌ ప్రభుత్వం చేపడుతున్న కుల గణనను సమర్థిస్తూ పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆగస్టు 21 న సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ప్రాథమికంగా కేసు నమోదు చేస్తే తప్ప ఈ అంశంపై స్టే ఇవ్వలేమని న్యాయస్థానం పిటిషనర్లకు వెల్లడించింది. బిహార్‌లో కులగణన నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి ఈ వివాదం నడుస్తోంది. కుల గణనను వ్యతిరేకిస్తూ గతంలో కూడా పలు మార్లు పిటిషన్లు దాఖలయ్యాయి.