శిశువుకు తల్లిపాలే ఆధారం. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాల మీదే ఆధారపడతారు బిడ్డలు. ఆ సమయంలో తల్లి తీసుకునే ఆహారమే వారికి అందే పోషకాలను నిర్ణయిస్తుంది. కాబట్టి బిడ్డలను దృష్టిలో ఉంచుకొని తల్లి ఆహారాన్ని తీసుకోవాలి. వారి శారీరక మానసిక ఎదుగుదలకు తగ్గ ఆహారాన్ని ఎంచుకొని తినాలి. అలాగే వారిలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని కూడా తినాలి. ఇలా వారికి పోషకాలను అందించే ఆహారాన్ని తినడంతో పాటు వారికి అనారోగ్యాలను తెచ్చిపెట్టే ఆహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. లేకుంటే పిల్లల్లో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


ఎంతోమందికి కాఫీ, టీలు తాగే అలవాటు ఉంటుంది. గర్భిణీలుగా ఉన్నప్పుడు, ప్రసవం అయ్యాక కూడా టీ, కాఫీలు తాగుతూనే ఉంటారు. బిడ్డకు పాలిచ్చే తల్లులు కెఫీన్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. అంటే టీ కాఫీలు తాగకపోవడమే ఉత్తమం. ఇందులో ఉండే కెఫీన్ పిల్లలకు జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. అలాగే వారికి నిద్ర రాకుండా చేస్తుంది. చికాకును కలిగిస్తుంది. పిల్లలు తరచూ ఏడుస్తున్నారంటే మీరు ఎలాంటి ఆహారాన్ని తింటున్నారో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. కాఫీని రోజుకి ఒకసారికి మించి తాగకపోవడమే ఉత్తమం. పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది.


కొన్ని రకాల కాయగూరలను కూడా దూరంగా ఉంచాలి. పిల్లల్లో గ్యాస్టిక్ సమస్యలను తెచ్చిపెట్టే కాలీఫ్లవర్, క్యాబేజీ, దోసకాయ, బ్రకోలి వంటి వాటిని తినకపోతే ఉత్తమం. అలాగే మిరియాలు, దాల్చిన చెక్క వేసిన ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా పిల్లల జీర్ణవ్యవస్థ పై ప్రభావాన్ని చూపిస్తాయి. వారిలో అరుగుదల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విరేచనాలు కావడం వంటివి కూడా జరగొచ్చు. కాబట్టి పిల్లలు పాలు మానేసే వరకు  ఇలాంటి పదార్థాలతో వండిన ఆహారాలకు దూరంగా ఉండటం ఉత్తమం.


మీ పిల్లలు కేవలం తల్లిపాల మీదే ఆధారపడుతున్నప్పుడు పుదీనా వేసిన ఆహారాన్ని తినకండి. ఇది పాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. కాబట్టి పాలు మానేపించే వరకు పుదీనాను దూరంగా పెట్టడం ఉత్తమం. కోడిగుడ్లు, పాలు, ఆకుకూరలు, బీట్ రూట్, క్యారెట్, చికెన్, మటన్ వంటివి తరచూ తింటుంటే పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఏవైనా కూడా అతిగా తినకూడదు. మితంగా తింటే బిడ్డకు తల్లికి ఇద్దరికీ ఆరోగ్యకరం. నువ్వుల నూనెతో వండిన వంటకాలు తింటే బిడ్డ రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. కాబట్టి బిడ్డ పాలిస్తున్నంత కాలం నువ్వుల నూనెతో వంట చేసుకోవడం ఉత్తమం.



Also read: మానసిక ఆందోళన మితిమీరిపోయిందా? అయితే అది జబ్బే



Also read: డయాబెటిస్ ఉంటే మతిమరుపు వ్యాధి త్వరగా వచ్చేస్తుందట















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.