Raksha Bandhan 2023: రక్షాబంధన్ కి సంబంధించి ఎన్నో కథలు,పురాణగాథలు చెబుతారు పండితులు. ఆ గాథల్లో ఒకటి బలిచక్రవర్తికి శ్రీ మహాలక్ష్మి రాఖీ కట్టడం. ఆ తర్వాత వామన అవతారం చాలించిన శ్రీ మహావిష్ణువు సతీ సమేతంగా వైకుంఠానికి పయనమయ్యాడు. అలా వామన అవతారం చాలించి శ్రీ మహావిష్ణువుగా మారిన తర్వాత మొదట అడుగుపెట్టిన ప్రదేశమే ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా ఉర్గామ్ లోయ. ఇక్కడ బన్షీ నారాయణుడిగా కొలువయ్యాడు శ్రీ మహావిష్ణువు. అలకనందానది ఒడ్డున ఉన్న ఈ ఆలయం చుట్టూ ప్రకృతి అందాలు చూపుతిప్పుకోనివ్వవు. 13 వేల అడుగుల ఎత్తులో బద్రీనాథ్ ధామ్‌కు అతి సమీపంలో కొలువైఉన్నాడు బన్షీ నారాయణుడు. ఈ ఆలయంలో సందడంతా రాఖీ రోజు మాత్రమే ఉంటుంది. తలుపులు తెరిచి పూజలు చేసిన అనంతరం మహిళలు , బాలికలు రాఖీలకు పూజలు చేసి స్వామివారి సన్నిధిలో సోదరులకు రాఖీలు కడతారు.


Also Read: ఆగష్టు 30 or 31 రక్షాబంధన్ ఎప్పుడు, రాఖీ పండుగ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు!


స్థలపురాణం
శ్రీ మహావిష్ణువు వామనఅవతారంలో బలిచక్రవర్తి అనే రాక్షసరాజు అహంకారాన్ని భగ్నం చేసి పాతాళానికి తొక్కేస్తాడు. ఆ తర్వాత శ్రీహరి ఇక్కడే ద్వారపాలకుడిగా ఉండిపోతాడు. భర్తకోసం ఎదురుచూసిన లక్ష్మీదేవి వెతుక్కుంటూ హేడిస్ చేరుకుని బలిచక్రవర్తికి  రాఖీ కట్టి తన భర్తను తనతో పాటూ తీసుకెళ్లిపోతుంది. విష్ణువు తన వామన అవతారం నుంచి విముక్తి పొందిన తర్వాత ఇక్కడే మొదటిసారిగా కనిపించాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో ఒక గుహ కూడా ఉంది. ఇక్కడే భక్తులు కానుకలు సమర్పించుకుంటారు. రక్షాబంధన్ రోజున  స్థానికులు ప్రసాదంలో వెన్న కలిపి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు.  స్వామివారు ద్వారపాలకుడిగా ఉండిపోయిన ఆ ఆలయాన్ని అప్పటి నుంచి ఏడాదికోసారి రక్షాబంధన్ రోజు తెరిచి ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు. మిగిలిన రోజుల్లో నారద మహాముని వచ్చి పూజలు చేస్తారని విశ్వసిస్తారు. 


Also Read: ఆగష్టు 29 రాశిఫలాలు, ఈ రాశులవారికి ఈ రోజు ఆర్థిక వనరులు పెరిగే అవకాశం ఉంది!


స్వామివారి దర్శనం అంత సులువేం కాదు
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని దుర్గమ లోయలో ఉన్న ఈ ఆలయాన్ని వంశీనారాయణ దేవాలయం అని కూడా  అంటారు. ఈ ఆలయానికి చేరుకోవడం అంత సులభమేమీ కాదు.  గోపేశ్వర్ నుంచి ఉర్గాం లోయకు కారులో చేరుకోవాలి. ఆ తర్వాత దాదాపు 12 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. వందల ఏళ్ల క్రితంనాటి ఆలయం, ఏడాదికోసారి తెరిచే ఈ ఆలయానికి చేరుకోవాలంటే అంత సులువేం కాదంటారు భక్తులు. పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే ఈ ఆలయానికి ట్రెక్కింగ్ చేస్తూ  చేరుకునేవారి సంఖ్య ఎక్కువ. బన్సీ నారాయణ్ ఆలయంలో విష్ణువుతో పాటూ శివుడు, గణేషుడి విగ్రహాలు కూడా కనిపిస్తాయి. 


సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టేటప్పుడు సోదరీమణులు జపించాల్సిన రక్షా బంధన్ గురించి ఒక ప్రత్యేక మంత్రం కూడా ఉంది. 


యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
తేనత్వామభిబధ్నామి రక్షే మా చలమాచల॥


‘ఎంతో బలవంతుడైన బలిచక్రవర్తినే బంధించిన విష్ణుశక్తితో ఉన్న రక్షాబంధనాన్ని నీకు కడుతున్నాను. ఈ శక్తితో నువ్వు చల్లగా వర్ధిల్లాలి’ అని పై శ్లోకానికి అర్థం. బలిచక్రవర్తిపై అభిమానంతో శ్రీ మహా విష్ణువు అక్కడే ఉండిపోతాడు. తనతో పాటూ భర్తను తీసుకెళ్లేందుకు వచ్చిన మహాలక్ష్మి  బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టిందని భవిష్య పురాణం చెబుతోంది. అందుకే ఈ శ్లోకం చదువుతూ సోదరులకు రాఖీ కట్టాలని పండితులు చెబుతారు.


Also Read: శని ఉందని ఎలా తెలుస్తుంది, చీమలకుఆహారం వేస్తే శని బాధల నుంచి ఎందుకు విముక్తి కలుగుతుంది


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే.  దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.