Raksha Bandhan 2023: ఆగస్టు 31 గురువారం రాఖీ పౌర్ణమి.
శ్రావణ పౌర్ణమి ఆగష్టు 30 బుధవారం ఉదంయ 10 గంటల 33 నిముషాలకు ప్రారంభమై ఆగష్టు 31 గురువారం ఉదయం 8 గంటలవరకూ ఉంది. సాధారణంగా పండుగలకు సూర్యోదయానికి ఉన్న తిథిని లెక్కలోకి తీసుకుంటారు కావున..రాఖీ పౌర్ణమి గురువారం జరుపుకోవాలని పంచాంగ కర్తలు నిర్ణయించారు. అయితే ఈ వేడుకను కొందరు సాయంత్రం సెలబ్రెట్ చేసుకుంటారు..వారంతా ఆగష్టు 30 రోజునే చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
రాఖీ పండుగ ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలియజేస్తూ ఎన్నో పురాణ కథనాలున్నాయి....
ఇంద్రుడి భార్య మొదలుపెట్టిన రాఖీ పండుగ
దేవతలకు, రాక్షసుల కు మధ్య దాదాపు పన్నెండేళ్లు యుద్ధం జరిగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు ఇంద్రుడుతన పరివారాన్ని తీసుకెళ్లి అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి...దేవేంద్రుడు యుద్ధంలో పాల్గొనేలా ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలంతా వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. యద్ధంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం..రాఖీ పండుగగా ఆచరిస్తున్నామని పురాణాలు చెబుతున్నాయి.
Also Read: ఆగష్టు 24 రాశిఫలాలు, ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఈ రాశివారి పనితీరు అద్భుతంగా ఉంటుంది
ద్రౌపది - శ్రీకృష్ణుని బంధం
మహాభారతంలో శ్రీకృష్ణుడు, శిశుపాలుడిని వధించాలని అనుకుంటాడు. అందుకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా... సుదర్శన చక్రాన్ని వదిలే క్షణంలో చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసినవెంటనే ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా తన చీరకొంగును చించి శ్రీకృష్ణుని వేలుకి రక్షగా చుట్టింది. అన్నగా భావించి వెంటనే స్పందించినందుకు అండగా ఉంటానని అప్పుడు భరోసా ఇచ్చాడు.ఈ సంఘటనే రాఖీ పండుగకు నాందిగా నిలిచిందని చెబుతారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం కురుసభలో అవమానం ఎదుర్కొంటున్న ద్రౌపదికి అండగా నిలిచాడు శ్రీ కృష్ణుడు.
Also Read: శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతానికి బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారు
శ్రీ మహాలక్ష్మి-బలిచక్రవర్తి
రాక్షస రాజు బలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు రాక్షసుల నుంచి మనుషులను రక్షించడానికి శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకి వస్తాడు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రదారాన్ని చేతికి కట్టి తానెవరో చెబుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది.
వినాయకుడి సోదరి ఆవిర్భావం
శ్రావణ పౌర్ణమి రోజున వినాయకుడు తన సోదరి అయిన నాగదేవతతో 'రక్ష' కట్టించుకోవడం చూసిన ఆయన కుమారులు..తమకి కూడా సోదరి కావాలని పట్టుబట్టారట. అప్పుడు వినాయకుడి కళ్లనుంచి సంతోషిమాత ఆవిర్భవించిందని చెబుతారు. అవివాహితులు, పిల్లలు లేని దంపతులు సంతోషి మాతని శుక్రవారం రోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోర్కెలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. శ్రావణ పూర్ణిమ రోజు రాఖీ కట్టిన, కట్టించుకున్నవారిపై సంతోషిమాత దీవెనలుంటాయంటారు.
చరిత్రలోనూ రాఖీ పౌర్ణమి
పురాణ కాలంలో, ప్రాచీన గ్రంథాల్లోనే కాదు...రాఖీ సంప్రదాయం చరిత్రలోనూ కనిపిస్తుంది. అలగ్జాండర్ మన దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు పురుషోత్తముడనే రాజు నిలువరించాడు. పురుషోత్తముని చేతిలో తన భర్త హతం అవుతాడనే భయంతో...అలగ్జాండర్ భార్య పురుషోత్తముని పతిభిక్ష పెట్టమని వేడుకుంటూ రాఖీని పంపిందట. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెట్టాడని చెబుతారు.
మొఘల్ పాలనలో చిత్తోడ్ రాజ్యాన్ని ఏలుతున్న కర్నావటి అనే రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయున్ కి రాఖీ పంపిందని చరిత్ర చెబుతోంది. రవీంద్రనాథ్ టాగూర్ కూడా ...స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలందరినీ ఒకటిగా ఉంచేందుకు, రక్షాబంధన్ ప్రోత్సహించారట.
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లో ఈ పండుగను బాగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా వైభవంగా జరుపుతున్నారు.