Shravana Masam 2023 : శ్రావణం.. ఆధ్యాత్మిక మాసం. హిందువులకు అత్యంత ప్రాధాన్యత కలిగిన నెల. అందుకే ఈ మాసాన్ని శుభాల మాసం, పండుగల మాసం అని కూడా అంటారు. ఈ నెలలో ప్రతి రోజూ శుభకరమే. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకమైంది. ఈ నెల రోజులూ ప్రతి ఇల్లూ నిత్యపూజలతో కళకళలాడుతుంది. ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతాయి. ఈ నెలలో అమ్మవార్లకు జరిపే ప్రత్యేక పుష్పాలంకరణ కోసం పూలు సేకరించడంలో ఎంతో మానసిక ఉల్లాసం ఉంటున్నదని శాస్త్రీయమైన సూచన. పరస్పరం ఇచ్చుకునే వాయినాల్లో స్నేహశీలత కన్పిస్తుంది. బేధాలు లేకుండా ఒకరికొకరు కాళ్లకు పసుపు రాసుకోవడం, ప్రసాదాలు, పండ్లు పంచుకోవడంలో సామరస్యత కన్పిస్తుంది. ఈ కాలంలో అధికంగా వచ్చే క్రిమికీటకాలు ఇళ్లలోకి రాకుండా ద్వారాలకు రాసే పసుపు ఔషధంగా పనిచేస్తుంది. గో పంచకం, గోమయం వినియోగంలో సామూహిక పారిశుధ్యం అనే వైద్య సూత్రం ఇడిమి ఉంటుంది.
Also Read: ఈ వారం ఈ రాశులవారికి ఆనందం, వారికి ఆదాయం - ఆగష్టు 21 to 27 వారఫలాలు
బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారంటే
ఆగష్టు 17 నుంచి మొదలైన శ్రావణమాసం సెప్టెంబరు 15 శుక్రవారం వరకూ ఉంటుంది. ఈ నెలలో మంగళవారం, శుక్రవారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఈ రోజు ప్రతి మహిళా అమ్మవారికి దగ్గర బంగారు కాసు పెట్టి పూజ చేస్తారు. ఒక్కొక్కరు వారింట శుభకార్యాల నిర్వహణను బట్టి అవసరమైన బంగారం కొనుగోలు చేస్తారు. కానీ శ్రావణ శుక్రవారం రోజు అందరూ అమ్మవారి దగ్గర కాసు పెట్టి పూజిస్తారు. ఎందుకంటే.. బంగారాన్ని శ్రీ మహాలక్ష్మి సమానంగా చూస్తారు. దక్షిణాయణంలో వచ్చే అత్యంత విశిష్టమైన శ్రావణమాసం...శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణం పేరుమీద వచ్చింది. తన భర్త పేరమీద ఏర్పడిన నెల కాబట్టి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. ఐశ్వర్యానికి చిహ్నంగా భావించే బంగారాన్ని అమ్మవారికి ఇష్టమైన శ్రావణమాసంలో, శుక్రవారం రోజు పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తమ శక్తి కొలది బంగారం కొనుగోలు చేస్తారు. ఏటా బంగారం కొనుగోలు చేయలేనివారు ఒకే కాసుని లేదా అమ్మవారి రూపుని పంచామృతాలతో శుభ్రం చేసి వినియోగిస్తారు.
Also Read: ఆగష్టు 22 రాశిఫలాలు, శ్రావణ మంగళవారం ఈ రాశులవారికి ఆర్థిక వృద్ధి
అన్యోన్యత కోసం
శ్రీ మహా విష్ణువు, మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ మాసంలో అమ్మవారిని పూజించేవారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం. అందుకే శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ పూజ చేసుకుంటారు. కోరిన వరాలిచ్చే తల్లిగా భావిస్తారు కాబట్టి ఆమెను వరలక్ష్మి రూపంలో పూజిస్తారు. శక్తి కొలది నూతన వస్త్రం, బంగారం, పంచభక్ష్యాలు సమర్పించి ప్రత్యేక పూజ చేస్తారు. ఐశ్వర్యం, సౌభాగ్యం , ఆరోగ్యం ఇవ్వాలని అమ్మవారిని వేడుకుంటారు.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం