CEO Vikas Raj: రాబోయే ఎన్నికలకు సంబంధించిన ప్రతీ ప్రతి ఫిర్యాదును జిల్లాల ఎన్నికల అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ ఆదేశించారు. అలాగే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికలను సమర్పించాలని పేర్కొన్నారు. బహదూర్‌పురా, గోషామహల్, నాంపల్లి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాల్లో వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఆగస్టు 27 ఆదివారం జరిగిన సమగ్ర సమీక్షా సమావేశంలో సీఈఓ వికాస్ రాజ్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్‌వోలు, ఏఈర్ఓలు, విచారణ అధికారులు పాల్గొన్నారు. ఈక్రమంలోనే సీఈఓ కొనసాగుతున్న రెండవ ఎస్ఎస్ఆర్ పురోగతిని సమీక్షించారు.
ఓటరు భాగస్వామ్యాన్ని పెంపొందించాలి: వికాస్ రాజ్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో 18 నుంచి 19 ఏళ్ల వయసు గల వారి ఓట్ల నమోదుపై దృష్టి పెట్టాలన్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు గల సముదాయాన్న, పీడబ్ల్యూడీ ఓటర్లను, ట్రాన్స్‌జెండర్లు, సెక్స్ వర్కర్ల నమోదు వందకు వంద శాతం అయ్యేలా చూడాలని కోరారు. ముఖ్యంగా 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల యువతను ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వివిధ ప్రచార పద్ధతులను పాటించాలని డీఈఓలు, ఏఆర్ఓలు, ఈఆర్ఓలకు సీఈఓ వికాస్ రాజ్ సమగ్ర సూచనలను జారీ చేశారు. ఓటరు భాగస్వామ్యాన్ని పెంపొందించడంతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మెరుగు పరిచేందుకు మార్గాలు అన్వేషించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. సీఈఓ కార్యాలయం, ఈసీ ద్వారా అందే ఫిర్యాదులను వెంటనే పరిశీలించి వాస్తవ నివేదికలను ఆలస్యం చేయకుండా సీఈవో కార్యాలయానికి పంపాలని డీఈవోలను ఆదేశించారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించేందుకు కేంద్రం ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ తోపాటు తెలంగాణ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణ అసెంబ్లీ పదవీ కాలం జనవరితో ముగియనుంది. తెలంగాణతోపాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలకు ఒకే దఫా షెడ్యూలును ప్రకటించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అక్టోబరు రెండో వారంలోగా షెడ్యూల్‌ను ప్రకటించడానికి కసరత్తు మొదలు పెట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం తెలంగాణలో పర్యటించేందుకు రెడీ అవుతోంది. అక్టోబరు మొదటి వారంలో రాష్ట్రంలో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్... 2018లో ఏడాది ముందుగానే అసెంబ్లీను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. 2018 అక్టోబరు 6న షెడ్యూల్, డిసెంబరు 7న పోలింగ్ జరిగింది. ప్రస్తుత గడువు వచ్చే ఏడాది జనవరి 16 వరకు ఉంది. ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు కూడా జనవరిలోనే ముగియనుంది. మిజోరం అసెంబ్లీ గడువు మాత్రం డిసెంబరు 17తో ముగియనుంది.