తాజాగా ట్విట్టర్‌ కు చెందిన 20 కోట్ల మంది యూజర్ల డేటా లీకైనట్లు వార్తలు వచ్చాయి. యూజర్ల డేటాను సంపాదించిన హ్యాకర్లు, ఈ సమాచారాన్ని అమ్మేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. 20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటాను డార్క్ వెబ్ ద్వారా 2 లక్షల డాలర్లకు అమ్మినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ఎస్ఈకే ఇప్పటికే వెల్లడించింది. ట్విట్టర్ యూజర్లకు సంబంధించిన ఈమెయిల్ ఐడీస్, పేరు, స్క్రీన్ నేమ్, యూజర్ నేమ్, అకౌంట్ క్రియేట్ చేసుకున్న డేట్, ఫాలోవర్ల సంఖ్య సహా పలు వివరాలను హాకర్లు దొంగిలించినట్లు తెలిపింది.  8 హ్యాకర్ గ్రూప్స్ ఈ వివరాలను సేకరించి అమ్మినట్లు  ప్రకటించింది.


డేటా లీక్ వార్తలన్నీ అవాస్తవాలే!


తాజాగా యూజర్ల డేటా హ్యాక్ కు సంబంధించి ట్విట్టర్ స్పందించింది. 200 మిలియన్ల మంది వినియోగదారుల డేటాను ఆన్ లైన్ లో విక్రయించబడుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించింది. హ్యాక్ అయిన డేటా వివరాలు మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ ఫారమ్ కు సంబంధించిన సిస్టమ్‌లలోని బగ్ ఫలితంగా జరగలేదని ట్విట్టర్ తెలిపింది. "మీ గోప్యతను రక్షించడానికి మేము చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం. ట్విట్టర్ వినియోగదారుల డేటా ఆన్‌లైన్‌లో విక్రయించబడుతుందని ఇటీవలి మీడియా నివేదికలకు ప్రతిస్పందనగా, మేము సమగ్ర దర్యాప్తు చేశాం. ఇటీవల విక్రయించిన డేటా Twitter బగ్ కారణంగా జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. మేం ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన  ఓ సంఘటన గురించి అప్ డేట్ ను కూడా అందుబాటులోకి తీసుకు రావాలి అనుకుంటున్నాం. ఇందుకోసం మేము తీసుకున్న చర్యలపై పారదర్శకతను అందించాలనుకుంటున్నాం" అని ట్విట్టర్ ఓ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది.


ఎలన్ మస్క్ యాజమాన్యంలోని ట్విట్టర్ సంస్థ ప్రకారం.. ‘‘లీక్ అయిన డేటాతో వినియోగదారుల సమాచారం సరిపోలలేదు. అందుకే, సమస్య గురించి పరిశోధించేందుకు విశ్లేషణ జరుపుతున్నాం. ఆన్‌లైన్‌లో విక్రయించబడుతున్న డేటా Twitter సిస్టమ్‌ బగ్ ద్వారా పొందినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. డేటా ఇప్పటికే ఆన్‌లైన్‌లో పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటా అయ్యి ఉండవచ్చు. డేటా లీక్ సంఘటనల గురించి వివరణను అందించడానికి మేం వివిధ దేశాల నుంచి డేటా సెక్యూరిటీ ఆఫీసర్స్, ఇతర సంబంధిత రెగ్యులేటర్‌లతో సంప్రదింపులు జరుపుతున్నాం’’ అని ట్విట్టర్ తెలిపింది.     


గత వారంలో వెలుగులోకి వచ్చిన డేటా లీక్ ఘటన


గత వారం ప్రారంభంలో, హ్యాకర్ వెబ్‌ సైట్ బ్రీచ్‌ ఫోరమ్స్‌ లో వందల మిలియన్ల మంది ట్విట్టర్ వినియోగదారుల ప్రాథమిక సమాచారం కలిగిన డేటా బేస్ ఓ అకౌంట్ ద్వారా పోస్టు చేశారు. StayMad అని పిలుచుకునే హ్యాకర్ Google CEO సుందర్ పిచాయ్, డోనాల్డ్ ట్రంప్ జూనియర్, SpaceX, CBS మీడియా, NBA, WHO  సహా 200 మిలియన్లకు పైగా వినియోగదారుల వ్యక్తిగత డేటాను లీక్ చేసినట్లు వెల్లడించాడు.


Read Also: రెండు గంటల పాటు పని చేయని ట్విట్టర్, మస్క్‌తో ఆటాడుకున్ననెటిజన్స్