సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో లాగిన్ సమస్య తలెత్తింది. ఇవాళ ఉదయం సుమారు రెండు గంటల పాటు వినియోగదారులు లాగిన్ కాలేకపోయారు. సైన్ ఇన్ చేస్తే ఎర్రర్ చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు.
రెండు గంటల వ్యవధిలోనే సమస్య పరిష్కారం
ట్విట్టర్ ఈ సమస్యను వెంటనే పరిష్కరించింది. లోపం ఎక్కడుందో తెలుసుకుని సుమారు రెండు గంటల వ్యవధిలోనే ట్విట్టర్ టెక్ నిపుణులు ప్లాబ్లమ్ సాల్వ్ చేశారు. సమస్య పరిష్కారం కాగానే వినియోగదారులు యథావిధిగా లాగిన్ అయ్యారు. అప్పటికే ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ కాలేకపోతున్నామంటూ ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ కు వేల సంఖ్యలో రిపోర్టులు అందాయి. భారత్, అమెరికా, జపాన్, కెనడా నుంచి ఎక్కువగా కంప్లైంట్స్ వెళ్లాయి. సమస్య పరిష్కారం అయ్యాక మస్క్ స్పందించారు. ట్విట్టర్ సర్వర్ ప్రాబ్లం తొలగిపోయిందని చెప్పారు. గతంతో పోల్చితే ట్విట్టర్ మరింత ఫాస్ట్ గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
ట్విట్టర్ సీఈవో పై నెటిజన్ల ఆగ్రహం
రెండు గంటల్లోనే ట్విట్టర్ సేవలు యథావిధిగా కొనసాగినా నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీమ్స్ తో మస్క్ మామను ఆడుకున్నారు. వాస్తవానికి ట్విట్టర్ మస్క్ చేతికి వెళ్లిన తర్వాత ట్విట్టర్ సేవలకు అంతరాయం కలగడం ఇది మూడోసారి. ఈ నెలలో ఇది రెండోసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో నెటిజన్లు మీమ్స్ తో ట్విట్టర్ సీఈవో ఆటపట్టించారు. ట్విట్టర్ ను కొనుగోలు చేయడం మాత్రమే కాదు, సరిగా మెయింటెయిన్ చేయడం నేర్చుకోవాలని మరికొంత మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.