Covid-19 in China: కరోనా వైరస్‌తో చైనా పరిస్థితి ఎలా ఉందో ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయి. శ్మశానాల వద్ద క్యూలైన్లు, మెడిసిన్స్ కొరత, ఆసుపత్రులు హౌస్‌ఫుల్ అంటూ చైనాలో కరోనా పరిస్థితులపై రోజూ కథనాలు వస్తాయి. ఎప్పటిలానే ఈ వార్తలను చైనా తోసిపుచ్చింది. ఇవన్నీ వక్రీకరించిన కథనాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.
నో ఆంక్షలు
కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ జీరో కొవిడ్ విధానం నుంచి చైనా క్రమంగా దూరంగా జరుగుతోంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులకు వచ్చే నెల 8వ తేదీ నుంచి క్వారంటైన్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. అంతేకాకుండా కొవిడ్ స్థాయిని క్లాస్ 'ఎ' ఇన్‌ఫెక్షన్ల నుంచి క్లాస్ 'బి' కి తగ్గిస్తున్నట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్ ప్రకటించింది.
తద్వారా కొవిడ్ రోగులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి తప్పనిసరి క్వారంటైన్ సహా కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో లాక్ డౌన్ అవసరం లేకుండా పోయింది. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు సడలించడంతో చైనీయులు విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీని వల్ల ఇతర దేశాలకు కూడా చైనాలో ఉన్న కొత్త వేరియంట్లు ప్రబలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నో మెడిసిన్స్
కరోనా విజృంభణ కారణంగా చైనాలో ఔషధాల సరఫరా తీవ్రంగా దెబ్బతింది. దీంతో బ్లాక్ మార్కెట్ దందా మొదలైంది. జనరిక్ కొవిడ్-19 ఔషధాలు ఫార్మసీలో దొరకకపోయేసరికి ప్రజలు బ్లాక్ మార్కెటింగ్‌ను ఆశ్రయిస్తున్నారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదిక ప్రకారం, దేశంలో ఆమోదించిన కొవిడ్-19 యాంటీ వైరల్ మెడిసిన్ సరఫరా పరిమితంగా ఉంది. అందులోనూ వాటి ధరలు ఆకాశ్నంటాయి. దీంతో ప్రజలు.. భారత్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న జనరిక్ మందుల వైపు పరుగులు పెడుతున్నారు.
భారత్ నుంచి నాలుగు రకాల జనరిక్ యాంటీ కొవిడ్ మందులు.. చైనా మార్కెట్‌లో చట్టవిరుద్ధంగా అమ్ముడవుతున్నాయి. ప్రిమోవిర్, పాక్సిస్టా, మోల్నునాట్, మోల్నాట్రిస్ బ్రాండ్ పేర్లతో వీటిని బ్లాక్ మార్కెట్ దందా చేస్తోంది.
చైనా ఈ సంవత్సరం రెండు కొవిడ్-19 యాంటీ వైరల్‌లను ఆమోదించింది. ఫైజర్స్ కంపెనీకి చెందిన పాక్స్‌లోవిడ్, చైనీస్ సంస్థ జెన్యూన్ బయోటెక్ నుంచి వచ్చి HIV ఔషధం అజ్వుడిన్‌ను చైనా ఆమోదించింది. కానీ ఈ రెండు మందులు కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని నివేదిక పేర్కొంది.
Also Read: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ 113 సార్లు సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించారు: CRPF