Ashneer Grover on Uber Cabs: మన దేశంలో అతి పెద్ద ఆన్‌లైన్ క్యాబ్ కంపెనీ ఉబెర్ ఇండియా (Uber India) క్యాబ్స్, అంతరిక్షాన్ని చుట్టొట్టాయట. భూమి నుంచి సుమారు 4.5 బిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించాయట. ఇలా వెళ్లీ వెళ్లీ... సౌర కుటుంబంలోని చివరి గ్రహం నెప్ట్యూన్ వరకు ప్రయాణాన్ని పూర్తి చేశాయట.
ఉబెర్ ఇండియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్ (Prabhjeet Singh), తన లింక్డ్ ఇన్ ఖాతాలో ఈ డేటాను పంచుకున్నారు. ఉబెర్ ఇండియా భారతదేశంలో సుమారు $4.5 బిలియన్ల ప్రయాణాన్ని పూర్తి చేసిందని రాశారు. కాబట్టి, తమ కంపెనీ క్యాబ్స్ భూమి నుంచి సౌర వ్యవస్థలోని చివరి గ్రహం వరకు ప్రయాణాన్ని పూర్తి చేశాయని వెల్లడించారు.
అష్నీర్ గ్రోవర్ రిప్లై మామూలుగా లేదు
ప్రభ్‌జీత్ సింగ్ షేర్ చేసిన సమాచారం మీద భారత్ పే (BharatPe) సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ (Ashneer Grover) వెటకారంగా స్పందించారు. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్ చేశారు. 'ఉబెర్ కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం... ఆ కంపెనీ కార్లు సౌర వ్యవస్థ మొత్తం దూరాన్ని భారతదేశంలోనే కవర్ చేశాయి' అంటూ ఎగతాళి చేశారు. ఇప్పుడు, మీరు ఎవరితో కలిసి అంగారక గ్రహానికి ప్రయాణించాలనుకుంటున్నారు? అంటూ నెజిటన్ల కోసం ఒక పోల్ పెట్టారు. దీని సమాధానంగా మూడు ఆప్షన్లు కూడా ఇచ్చారు.
మొదటి ఆప్షన్... ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌తో
రెండో ఆప్షన్... క్యాబ్ రద్దు చేయకపోతే ఉబర్ భయ్యాతో
మూడో ఆప్షన్... ఎవరినైనా ఎయిర్‌పోర్ట్‌కి పంపండి
ఉబెర్ ఇండియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్ పోస్ట్ చేసిన సమాచారం మీద వెటకారపు రియాక్షన్లు పెరగడంతో, ఆయన తన లింక్డ్ ఇన్ పోస్ట్‌ను తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న అష్నీర్ గ్రోవర్ మళ్లీ విరుచుకు పడ్డారు. ఉబెర్ అధికారులను లక్ష్యంగా చేసుకున్నారు. "చంద్రుడి దగ్గరకో, విశ్వంలోకో ప్రయాణించడానికో ఏ కస్టమర్ ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేయడం లేదు. మీరు చంద్రుడి గురించి ఆలోచించడం మానేసి, భూమ్మీద మీ సేవలు మెరుగు పరుచుకోవడం గురించి ఆలోచించండి అని సూచించారు. PR కంటే, కస్టమర్‌కు ఇచ్చే సేవ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి" అని అష్నీర్ గ్రోవర్ హితవు పలికారు.
ఉబెర్ క్యాబ్‌లు రద్దు కావడం వల్ల చాలా సార్లు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అష్నీర్ గ్రోవర్ ఇంత ఘాటుగా స్పందించారు. ఆయనకు కూడా ఉబెర్ నుంచి ఎప్పుడో ఒక చేదు అనుభవం ఎదురై ఉండవచ్చు. లేకపోతే ఇంత ఘాటుగా స్పందించరుగా!.