Kadapa Road Accident : కడప జిల్లా జమ్మలమడుగు మండలం ధర్మాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన కూర్చొని భోజనం చేస్తున్న కూలీలపై వేగంగా వచ్చిన టిప్పర్ దూసుకెళ్లిన ఘటనలో అక్కడికక్కడే  ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గొరిగెనూరు గ్రామానికి చెందిన తలారి ఓబులేసు,ధర్మాపురం గ్రామానికి చెందిన నాగ సుబ్బారెడ్డి మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. కూలీలను ఢీకొట్టిన టిప్పర్ పొలాల్లోకి దూసుకెళ్లడంతో అందులోని డ్రైవర్ కూడా మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ ఉప్పలపాడు గ్రామానికి చెందిన విజయ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనతో గ్రామాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రమాద స్థలంలో  మృతదేహాలు ఛిద్రమై గుర్తు పట్టలేని స్థితిలో రోడ్డు పై పడి ఉన్నాయి. ప్రమాద స్థలంలో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతులను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంక్రాంతి పండుగ వేళ మృతుల కుటుంబాలల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురు మృతి 


హరియాణాలోని పానిపట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి ఓ ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. వీళ్లు వెస్ట్‌బెంగాల్ నుంచి వలస వచ్చి పానిపట్‌లో నివసిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. మృతుల్లోదంపతులతో పాటు నలుగురు చిన్నారులున్నారు. ఈ దంపతులు స్థానికంగా ఓ ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ జీవనం సాగించే వారు. ఇంట్లో నుంచి ఉన్నట్టుండి పెద్ద ఎత్తున మంటలు రావడం వల్ల స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను రక్షించేందుకు ప్రయత్నించినా అప్పటికే వాళ్లు కాలి బూడిదైపోయారు. 


"ప్రాథమిక విచారణ ఆధారంగా చూస్తే..గ్యాస్ సిలిండర్ లీకేజ్ కారణంగా పేలుడు సంభవించింది. టీ చేసుకునేందుకు గ్యాస్ ఆన్ చేశారు. అప్పుడే సిలిండర్ పేలింది. ఊపిరాడక ఆరుగురు మృతి చెందారు. కచ్చితంగా ఏ కారణంతో చనిపోయారన్నది పోస్ట్ మార్ట్ రిపోర్ట్ వస్తే కానీ చెప్పలేం"- పానిపట్ డీఎస్పీ


ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సు -లారీ ఢీ


ములుగు జిల్లాలో  తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగపేట మండలం రాజుపేట కొత్త పెట్రోల్ బంక్ సమీపంలో  గురువారం తెల్లవారుజామున లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహిళా ప్రయాణికురాలు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. ములుగు జిల్లా మంగపేట మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని చీపురుదుబ్బ గ్రామం మూల మలుపు వద్ద విశాఖ నుంచి వస్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు ఇసుక లారీని ఢీకొట్టింది. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత ఏడాది మార్చి ఐదో తేదీన ములుగు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.  మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వెంకటాపూర్ మండలంలోని జవహార్‎నగర్ ఎర్రిగట్టమ్మ వద్ద అర్ధరాత్రి దాటాక ఆటోను డీసీఎం వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.