PM Kisan Samman Nidhi: రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, వ్యవసాయ రంగ వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. ఆ పథకాల్లో ఒకదాని పేరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana). ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2009లో ప్రారంభించింది. ఈ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం పేద రైతులకు రూ. 6,000 ఆర్థిక సాయం అందజేస్తుంది. ఈ సొమ్మును మూడు భాగాలుగా మార్చి, ఏడాదికి మూడు సార్లు చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. అంటే, సగటున 4 నెలలకు ఒకసారి, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2,000 రైతు ఖాతాలో జమ అవుతాయి. పీఎం కిసాన్ పథకం 13వ విడత (PM Kisan Scheme 13th Installment) నగదును కేంద్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోతోంది.
రైతు చనిపోతే ప్రయోజనం ఎవరికి లభిస్తుంది?
పీఎం కిసాన్ స్కీమ్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని నియమాలను ముందుగా తెలుసుకుందాం. సాధారణంగా, ఈ పథకం గురించి రైతుల్లో చాలా ప్రశ్నలు ఉంటాయి. ఒకవేళ పీఎం కిసాన్ పథకం లబ్ధిదారు చనిపోతే, ఈ పథకం ద్వారా వచ్చే ప్రయోజనం తన కుటుంబానికి కొనసాగుతుందా, లేదా? అన్నది కూడా రైతుల్లో ఉన్న సంశయాల్లో ఒకటి. ఈ ప్రశ్నకు ఇవాళ సమాధానం తెలుసుకుందాం.
ఒకవేళ, పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుగా ఉన్న రైతు చనిపోతే, ఆ రైతు వారసుడు సంబంధింత భూమి యాజమాన్యాన్ని పొందాలి. అప్పుడు, అతనే ఈ పథకం లబ్ధిదారు అవుతాడు.
అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 6,000 ప్రయోజనం పొందడానికి, PM కిసాన్ పోర్టల్‌లో కొత్తగా పేరు నమోదు చేసుకోవాలి. ఈ పోర్టల్‌లో నమోదు చేసే ముందు, అతను కిసాన్ యోజనకు అర్హుడా, కాదా అన్న విషయాన్ని అధికారులు తనిఖీ చేస్తారు.
PM కిసాన్ పోర్టల్‌లో ఇలా నమోదు చేసుకోండి:
1. PM కిసాన్ పోర్టల్‌లో మీ పేరు నమోదు చేసుకోవడానికి, అధికారిక పోర్టల్ https://pmkisan.gov.in ని సందర్శించండి.
2. ఆ తర్వాత, New Farmer Registration బటన్ మీద క్లిక్ చేయండి.
3. దీని తర్వాత, మీ ఆధార్ నంబర్‌ను అక్కడ నమోదు చేసి, ఆపై క్యాప్చా కోడ్‌ను పూరించాలి.
4. ఆ తర్వాత, 'క్లిక్ హియర్ టు కంటిన్యూ' ఆప్షన్ ఎంచుకోండి.
5. ఇప్పుడు మీకు ఒక దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. అందులో, ప్రభుత్వం తరపున అడిగిన మొత్తం సమాచారాన్ని పూరించాలి. ఆ ఫారం నింపిన తర్వాత సేవ్ చేయడం మరిచిపోవద్దు.
6. ఇక్కడితో, PM కిసాన్ పథకం కోసం మీ పేరు నమోదు ప్రక్రియ పూర్తి అవుతుంది.
7. ఇది కాకుండా, మీరు మొబైల్ ద్వారా, లేదా CSC కేంద్రానికి వెళ్లి ఆఫ్‌లైన్ కూడా దరఖాస్తు పొందవచ్చు.
PM కిసాన్ పథకానికి సంబంధించిన సహాయం కోసం:
పీఎం కిసాన్ లబ్ధిదార్లకు సాయం చేయడానికి ప్రభుత్వం కొన్ని హెల్ప్ లైన్ నంబర్‌లను జారీ చేసింది. ఆ నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా, పథకానికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఆ నంబర్లు... 1555261, 1800115526 లేదా 011-23381092. ఈ మూడు నంబర్లు టోల్ ఫ్రీ నంబర్లు.
ఇది కాకుండా, pmkisan-ict@gov.in ఐడీకి ఈ-మెయిల్ పంపడం ద్వారా కూడా పథకం గురించి సమాచారాన్ని పొందవచ్చు.