తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం పడుతోంది. గత వారం రోజులతో పోల్చి చూసుకుంటే చలి తీవ్ర కాస్త తగ్గింది. వారం పది రోజుల పాటు గజగజ వణికిపోయిన జనాలు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. 


ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఏర్పడిన పొడిగాలులు కర్ణాటకవైపు వెళ్లిపోవడంతో చలి తీవ్రత తగ్గింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి ఇన్ని రోజులు పొడిగాలులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నందున రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మూడేళ్ల కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 


పొడిగాలులు కర్ణాటకలోకి ప్రవేశించడంతో కర్ణాటకకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో చలి తీవ్రత కాస్త పెరిగింది. మిగతా ప్రాంతాల్లో చలి తీవ్రత తక్కువగా ఉంది. విశాఖ నగరంలో చలి గత నాలుగు రోజులతో పోలిస్తే కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. విశాఖ నగరంతోపాటుగా నగర పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్లలో ప్రస్తుతం 20 డిగ్రీల సెల్సియస్‌కి పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక్క కైలాసగిరి తప్ప మిగతా ప్రాంతాల్లో నార్మల్ వెదర్ ఉంది. ఈ ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో ఇంకా పెరగనున్నాయి. వచ్చే వారం నుంచి చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోనుంది. 







తెలంగాణలో పరిస్థితి చూస్తే తొమ్మిది పది జిల్లాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో చలి తీవ్రత తక్కువగానే ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్‌, కుమ్రుంభీం, నిర్మల్‌, మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, వికారాబాద్‌, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మిగతా ప్రాంతాలతో పోలిస్తే చలి తీవ్రత ఉండొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. మరో రెండు రోజులు ఉంటుందని అంచనా వేసింది. 


నిన్న తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత 32.4 డిగ్రీలు ఖమ్మంలో నమోదు అయింది. తక్కువ ఉష్ణోగ్రత 8.5 డిగ్రీలు ఆదిలాబాద్‌లో రిజిస్టర్ అయింది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 
ఇలా ఉన్నాయి. భద్రాచలంలో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు ఉంటే.. కనిష్టం- 16.5 ఉంది. హకీం పేట్‌లో 30.5- 13.9, దుండిగల్‌లో 31.3-11.8, హన్మకొండలో 30.5 -13.5 డిగ్రీలుగా నమోదు అయింది. హైదరాబాద్‌లో గరిష్ణ ఉష్ణోగ్రత 30.6 ఉంటే కనిష్ట ఉష్ణోగ్రత 13.7 డిగ్రీలుగా నమోదు అయింది.