Threads DM Feature: మెటా తన థ్రెడ్స్ యాప్‌కు ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లను తీసుకువస్తూనే ఉంది. తద్వారా వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. థ్రెడ్స్ యూజర్ ట్రాఫిక్ ప్రారంభంలో చాలా ఎక్కువగా ఉంది. కానీ ఆ తర్వాత బాగా పడిపోయింది. యాప్‌లో అనుకున్న స్థాయిలో ఫీచర్లు లేకపోవడమే దీనికి కారణం.


యూజర్‌బేస్‌ను పెంచుకోవడానికి కంపెనీ యాప్‌కి అప్‌డేట్‌లను తీసుకువస్తోంది. ఇటీవల మెటా యాప్‌లో ఫీడ్ కోసం ఫాలోయింగ్ ట్యాబ్ ఆప్షన్‌ను ఇచ్చింది. దీంతో యూజర్లు తాము ఫాలో అయ్యే వారి పోస్ట్‌లను క్రోనోలాజికల్‌గా పైన చూస్తారు. ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి త్వరలో యాప్‌లో డీఎం(డైరెక్ట్ ఆప్షన్) ఎంపిక అందుబాటులోకి వస్తుందని, తద్వారా వినియోగదారులు తమ స్నేహితులతో ఇంటరాక్ట్ అవ్వడం సులభం అవుతుందని తెలిపారు.


ఇప్పుడు ‘X’గా మారిన ట్విట్టర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్ యాప్‌ను  ప్రారంభించింది. ఈ యాప్ కేవలం ఐదు రోజుల్లోనే 100 మిలియన్ల యూజర్‌బేస్‌ను సాధించడం ద్వారా కొత్త రికార్డును సృష్టించింది. అయితే తర్వాత యాప్ యూజర్‌బేస్ పడిపోవడం ప్రారంభమైంది. అది దాదాపు 75 శాతానికి తగ్గింది. తగ్గిపోతున్న యూజర్‌బేస్‌ను తిరిగి తీసుకురావడానికి ఇప్పుడు కంపెనీ యాప్‌లో ఒకదాని తర్వాత ఒకటి అప్‌డేట్‌లను తీసుకువస్తోంది.


కంటెంట్ క్రియేటర్లకు రెవిన్యూ ఇస్తున్న ట్విట్టర్
క్రియేటర్లను యాప్ వైపు ఆకర్షించడానికి ప్రపంచవ్యాప్తంగా యాడ్స్ రెవెన్యూ ప్రోగ్రామ్‌ను ట్విట్టర్ ప్రారంభించింది. ఇప్పుడు ‘X’లో వెరిఫైడ్ వినియోగదారులు యూట్యూబ్ తరహాలో డబ్బును సంపాదించగలరు. అయితే దీని కోసం యూజర్లకు కొన్ని ప్రాథమిక అర్హతలు ఉండాలి. అకౌంట్‌ను మానిటైజ్ చేయడానికి, గత మూడు నెలల్లో 15 మిలియన్ల ట్వీట్ ఇంప్రెషన్‌లు ఉండాలి. అలాగే అకౌంట్‌లో 500 కంటే ఎక్కువ మంది ఫాలోయర్లు ఉండాలి. ఈ రెండు షరతులను పూర్తి చేసిన తర్వాత మీరు ఎక్స్ నుంచి కూడా డబ్బు సంపాదించవచ్చు.


ఎలాన్ మస్క్ త్వరలో యాప్‌లో వీడియో, వాయిస్ కాల్‌లకు సంబంధించిన సేవలను కూడా తీసుకురాబోతున్నారు. రాబోయే కాలంలో మీరు పేమెంట్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను కూడా పొందుతారు. మీరు ఈ యాప్ నుంచి బిల్లులను కూడా చెల్లించగలరు.


థ్రెడ్స్‌పై తగ్గుతున్న ఇంట్రస్ట్
నిజానికి చెప్పాలంటే యూజర్స్ థ్రెడ్స్‌పై ఎక్కువగా ఇంట్రస్ట్ చూపడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ యాప్ పెట్టడానికి బేసిక్ రీజన్ ఏంటో యూజర్లకు అర్థం కావడం లేదు. ఈ యాప్‌లో ట్విట్టర్ లాగానే పోస్ట్ చేయడానికి యూజర్లకు అనుమతిస్తుంది. కానీ ప్రస్తుతం ఇందులో ట్విట్టర్ అందిస్తున్న మేజర్ ఫీచర్లు ఏమీ అందుబాటులో లేవు. ప్రస్తుతం ఎలాన్ మస్క్‌ ట్విట్టర్‌కు చేస్తున్న మార్పులు యూజర్లకు నచ్చడం లేదు. నిజానికి అక్కడి యూజర్లందరూ ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు. థ్రెడ్స్ ప్రారంభంలో చాలా ప్రామిసింగ్‌గా అనిపించింది కానీ కంపెనీ కూడా దీనిపై సీరియస్‌గా ఉన్నట్లు కనిపించడం లేదు. ట్విట్టర్‌ని ఎంత తిట్టుకున్నా మళ్లీ అక్కడికే రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో ట్విట్టర్‌కు సరిగ్గా పోటీని ఇచ్చే యాప్ ఏదీ లేదు. థ్రెడ్స్ దీనికి మంచి ప్రత్యామ్నాయంగా మారుతుందేమో చూడాలి.


Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial