చాలా మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ముఖ్యమైన ఇబ్బందులలో ఒకటి బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం. ఎంత ఖరీదైన ఫోన్ అయినా, ఛార్జింగ్ లేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే, మోబైల్ వినియోగిస్తున్న కొద్దీ దాని బ్యాటరీ లైఫ్ తగ్గుతూ ఉంటుంది. పూర్తి స్థాయిలో ఛార్జింగ్ చేసినా కొద్ది గంటల్లోనే అయిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే, కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా బ్యాటరీ లైఫ్ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


1. మీ బ్యాటరీ 0% లేదంటే 100%కి వెళ్లకుండా చూసుకోండి


స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్(100%) చేయడం, పూర్తిగా డిశ్చార్జ్(0%) చేయడం మంచింది కాదు. లిథియం-అయాన్ బ్యాటరీలు పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు లేదంటే పూర్తిగా డ్రైన్ అయినప్పుడు చాలా ఒత్తిడికి లోనవుతాయి. అందుకే, బ్యాటరీని సుమారు 80% వరకు ఛార్జ్ చేయాలి. 30% కంటే తక్కువగా పడిపోకుండా చూసుకోవాలి.  గరిష్టంగా 90% లక్ష్యంగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ ఫోన్ 20% కంటే లోపు రాకుండా చూసుకోవాలి. 


2. మీ బ్యాటరీని 100% మించి ఛార్జ్ చేయడం మానుకోండి


చాలా మంది ఫోన్ వినియోగదారులు రాత్రి పూట ఛార్జింగ్ పెట్టి అలాగే వదిలి వేస్తారు. ఇలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. 100% ఛార్జ్‌ లో ఉంచినప్పుడు, మీ బ్యాటరీ అధిక వోల్టేజ్ నుంచి అధిక ఒత్తిడిని పొందడమే కాకుండా వేడి కూడా పెరుగుతుంది. ఒక్కోసారి వేడి తీవ్రత పెరిగి పేలే అవకాశం ఉంటుంది. అందుకే, చల్లగా, బాగా వెంటిలేషన్ ఉన్న ప్రాంతంలోనే చార్జింగ్ పెట్టండి. 100% ఛార్జింగ్ కాకుండా చూసుకోండి.   


3. నెమ్మదిగా ఛార్జ్ చేసేందుకు ప్రయత్నించండి   


వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ సమయాన్ని ఆదా చేయగలవని చాలా మంది భావిస్తుంటారు. అలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. అందుకే, మీ కంప్యూటర్ లేదంటే ల్యాప్‌టాప్ ద్వారా మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడం ఉత్తమం.   


4. అవసం లేకుంటే WiFi, బ్లూటూత్‌ ఆఫ్ చేయండి 


అవసరం లేని సమయంలో WiFi, బ్లూటూత్‌ ఆఫ్ చేయడం మంచింది. మీరు రోజంతా WiFi వాడకుండా ఉంటే చాలా వరకు ఛార్జింగ్ ఆదా అవుతుంది.  WiFi, బ్లూటూత్‌ ఆన్ లో ఉంచితే ఆటోమేటిక్ గా నెట్ వర్క్ ల కోసం అవి స్కాన్ చేస్తూనే ఉంటాయి. ఫలితంగా ఛార్జింగ్ అయిపోతుంది.    


5. మీ లొకేషన్ సర్వీస్ ను మేనేజ్ చెయ్యండి   


ఈ రోజుల్లో చాలా యాప్‌లు మీ ఫోన్ లొకేషన్ ను ట్రాక్ చేస్తాయి. GPS, WiFi, బ్లూటూత్, సెల్ టవర్ లొకేషన్‌ కలయికతో నిరంతరం లొకేషన్ ను స్కాన్ చేస్తాయి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ ఛార్జింగ్ వేస్ట్ అవుతుంది. అందుకే   మీరు యాప్‌ని ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే లొకేషన్ వివరాలను పొందేలా సెట్టింగ్స్ చేసుకోండి.  


6. అవసరం ఉంటేనే అసిస్టెంట్ ఫీచర్లను వాడండి   


Google అసిస్టెంట్, సిరి లాంటి ఫీచర్లు ఉపయోగకరం అయినప్పటికీ, బ్యాటరీ ఛార్జింగ్ ను వృథా చేస్తాయి. అందుకే, మీకు ఈ ఫీచర్‌లు అవసరం లేకుంటే డిసేబుల్ చేయడం మంచిది. 


7. మీ యాప్‌లను మేనేజ్ చెయ్యండి   


బ్యాటరీ లైఫ్ పెంచడానికి ఫోన్ లోని యాప్స్ అన్నీ క్లోజ్ చేయాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే, ఫోన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్‌లను ఫోర్స్-క్విట్ చేయడం వల్ల మీ బ్యాటరీ లైఫ్ ఏ మాత్రం మెరుగుపడదు. పైగా క్లోజ్ చేసిన యాప్‌ని తెరవడం వల్ల ఎక్కువ పవర్ ఉపయోగించబడుతుంది. అందుకే యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్నప్పుడు ఒక్క యాప్ ఎంత బ్యాటరీని ఉపయోగించాలో సెట్ చేసుకోవాలి.   


8. బ్రైట్ నెస్ తగ్గించండి


మోబైల్ స్క్రీన్ బ్రైట్‌ నెస్ అనేది మీ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంది. అందుకే బ్రైట్ నెస్ తగ్గించడం వల్ల బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. 


9. స్మార్ట్ బ్యాటరీ మోడ్‌లను ఉపయోగించుకోండి


ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు చాలా వరకు స్మార్ట్ బ్యాటరీ సేవర్ లేదంటే లో పవర్ మోడ్‌తో వస్తున్నాయి. మీ ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఈ పవర్ సేవింగ్ మోడ్‌లు ఆటోమేటిక్‌గా కిక్ అవుతాయి. మీకు కావలసినప్పుడు వాటిని మాన్యువల్‌గా వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ పెరుగుతంది.    


10. డార్క్ మోడ్‌ను పెట్టుకోండి


స్మార్ట్ ఫోన్ డార్క్ మోడ్‌కి మారడం ద్వారా మీ బ్యాటరీ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. డార్క్ మోడ్‌కి మారడం వల్ల iPhone బ్యాటరీ లైఫ్ 30%, గూగుల్ పిక్సెల్ 63% పెరిగినట్లు తేలింది.  


Read Also: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial