ఆదిలాబాద్: తాను రైతు కుటుంబం నుండే వచ్చానని, రైతులు, భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే భూ భారతి చట్టం (Bhu Bharathi Act) తీసుకొచ్చామని రాష్ట్ర రెవెన్యు, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. అందరికీ ఉపయోగపడేలా భూ భారతి చట్టం తీసుకొచ్చాం, ఆధార్ లాగే భూదార్ కార్డ్ నెంబర్ ఇస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇన్చార్జి మంత్రి సీతక్క పర్యటించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హెలిప్యాడ్ ద్వారా చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజార్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ వారికి పుష్ప గుచ్ఛాలు అందించి స్వాగతించారు. అక్కడి నుండి భోరజ్ మండలం పూసాయి గ్రామంలోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు.
జవాబుదారితనాన్ని పెంచేందుకు భూ భారతి
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతులకు తమ భూముల విషయంలో ఎలాంటి అపోహలకు తావివ్వకుండా, జవాబుదారితనాన్ని పెంచేందుకు భూ భారతిని తీసుకొచ్చాం. ధరణిలో ప్రజా సమస్యల పరిష్కారం కాలేదని, ప్రజా ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూ భారతి-2025 చట్టాన్ని అందుబాటులోకి తెచ్చాం. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, నిషేధిత భూములు, ఆర్ ఓ ఆర్ మార్పులు చేర్పులు వంటి సేవలు సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు.
గతంలో రైతులు తమ సొంత అవసరాలు, ఆడపిల్లల పెళ్లిళ్ల ఖర్చుల నిమిత్తం వారసత్వంగా వచ్చిన భూములను అమ్ముకోవడానికి గత ధరణి-2020తో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి లోటుపాట్లను గుర్తించిన ప్రభుత్వం ప్రజలకు సరళంగా ఉండే విధంగా భూ భారతి చట్టాన్ని రూపొందించాం. ధరణి చట్టం కారణంగా నెలల తరబడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగేది. గతంలో ప్రభుత్వ స్థలాలతో పాటు పార్ట్-బి లో శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని’ వెల్లడించారు.
ధరణి ఇబ్బందులను గుర్తించి తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్న మాటకు కట్టుబడి చర్యలు చేపట్టినట్లు మంత్రులు పేర్కొన్నారు. రైతులకు, అధికారులకు సులభంగా అర్ధం అయ్యేలా సామాన్య, గ్రామీణ ప్రజల, రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేలా భూ భారతి రూపొందించామన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగకుండా గ్రామాల్లోని ప్రజలు దగ్గరకు అధికారులు వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి రోజుకు రెండు మండలాల చొప్పున అధికారులు పర్యటిస్తున్నారు. ఈ నెల 30 వరకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నామని.. ప్రజల్లో ఈ చట్టం పై పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ, ఎమ్మెల్యేలు, తదితరులు ప్రసంగించారు. అనంతరం అక్కడే గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని మంత్రులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ధరణితో కుటుంబాల మద్య, అన్నాదమ్ముళ్ళ మధ్య చిచ్చు పెట్టించి, వారి మధ్య విభేదాలను సృష్టించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల మేలు కోసం భూ భారతిని తెచ్చారని తెలిపారు. రైతు బిడ్డకు మాత్రమే రైతుల కష్టాలు, భూమితో రైతుకు ఉన్న అనుబంధం తెలుస్తుందని, భూ భారతి అమలుతో రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. పైరవీలు అవసరం లేదు.. పోర్టల్‌లో పరిష్కారాలుభూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, భూమికి సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. భూముల అమ్మకాలు, కొనుగోలు సులభంగా జరుగుతాయన్నారు. సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు భూ భారతితో పరిష్కారమవుతాయని చెప్పారు. మీ భూముల సమస్యల పరిష్కారానికి ఎవ్వరి దగ్గర పైరవీలకు పోవాల్సిన అవసరం లేదనీ, భూ భారతి పోర్టల్ లో అన్ని రకాల ఆప్షన్లు ఉన్నాయన్నారు. అనంతరం జిల్లాలోని మావల పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే తో కలిసి నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ నమూనా గృహాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి మంత్రి సీతక్క, ఆర్థిక ప్రణాళిక శాఖ అధికారి రాంకిషన్, సర్వేలాండ్ అధికారి జ్యోతి బుద్ధ ప్రకాశ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారిణి ఖుష్బూ గుప్తా, స్థానిక రైతులు, తదితరులు పాల్గొన్నారు.