How To Disable Microphone Access On Mobile Phone: ఒక్కోసారి మన జీవితంలో తమాషా సంఘటనలు జరుగుతుంటాయి. మనం నిన్నో, మొన్నో లేదా ఈ మధ్య మాట్లాడుకున్న కొన్ని విషయాలు హఠాత్తుగా మొబైల్‌ ఫోన్‌లో వార్తల రూపంలోనో, ప్రకటనల రూపంలోనో ప్రత్యక్షం అవుతుంటాయి. ఉదాహరణకు.. మీ ఇంట్లోకి కొత్త ఏసీ కొనాలని భావిస్తూ, దాని గురించి మాట్లాడుకుంటే.. మీ మొబైల్‌ ఫోన్‌లో దానికి సంబంధించిన యాడ్స్‌, ఆఫర్స్‌ కనిపించడం ప్రారంభం అవుతుంది. ఆహారం నుంచి అనారోగ్యం వరకు, విసనకర్ర నుంచి విహారయాత్ర వరకు.. మీరు ఏం మాట్లాడినా దానికి సంబంధించిన ఏదోక విషయం మీ మొబైల్‌లో వార్తగానో, యాడ్‌గానో కనిపిస్తుంటుంది. మనలో చాలా మందికి ఈ అనుభవం ఎదురై ఉంటుంది. ఇది గమ్మత్తుగా అనిపించినప్పటికీ, నిజానికి భయపడాల్సిన విషయం. దీని అర్ధం.. మీ మీ స్మార్ట్‌ఫోన్‌ మీ మీదే గూఢచర్యం చేస్తోంది, దొంగచాటుగా మీ మాటలు వింటోంది. 

గూఢచర్యం చేస్తున్న మైక్రోఫోన్‌ మన మాటలు లేదా ప్రణాళికలు మొబైల్‌ ఫోన్‌లో కనిపించడం ఏమాత్రం యాదృచ్చికం కాదు. మీ స్మార్ట్‌ఫోన్‌లోని మైక్రోఫోన్‌ మీ కార్యకలాపాలను గమనిస్తూ, మీపై ఓ చెవ్వేసి మీరు చెప్పే ప్రతిదాన్ని వింటుందన్నది నిజం. స్మార్ట్‌ఫోన్‌ లేనిదే రోజు గడవని రోజులు ఇవి. వివిధ పనులు, వినోదం కోసం మొబైల్‌ ఫోన్‌లో చాలా యాప్స్‌ ఇన్‌స్టాల్ చేస్తాం. వాటిలో చాలా యాప్‌లకు మైక్రోఫోన్ యాక్సెస్ ఉంటుంది. ఆ యాప్‌లు ఆన్‌ చేసినప్పుడే కాదు, మనకు కనిపించకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో పని చేస్తున్నప్పుడు కూడా మైక్రోఫోన్‌ ఆన్‌లో ఉంటుంది. అది మీ సంభాషణలు రికార్డ్ చేస్తుంది & ఆ మాటలకు సంబంధించిన కంటెంట్ లేదా ప్రకటనలను మొబైల్‌లో చూపిస్తుంది.

మొబైల్‌లోని మైక్రోఫోన్‌కు మీరు ఇచ్చిన యాక్సెస్‌ దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా ఉంది, మీ గోప్యతకు ముప్పుగా మారవచ్చు. ఇది బ్యాడ్‌ న్యూస్‌ అయినప్పటికీ గుడ్‌ న్యూస్‌ కూడా ఉంది. కావాలనుకుంటే, మీ మైక్రోఫోన్‌ను మీరు నియంత్రించవచ్చు. కొన్ని సింపుల్‌ స్టెప్స్‌తో మీ ఫోన్‌లో ప్రైవసీ సెట్టింగ్స్‌ను బలోపేతం చేయవచ్చు. ఆ తర్వాత మీ ఫోన్ మీ కార్యకలాపాలను ట్రాక్ చేయలేదు.

మొబైల్‌లో మైక్రోఫోన్‌ యాక్సెస్‌ను ఎలా డిజేబుల్‌ చేయాలి?

మీ మొబైల్‌ ఫోన్ సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయండి. Privacy & Security సెక్షన్‌లోకి వెళ్లండి. అక్కడ Privacy ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత Permission Manager ను ఎంచుకోండి. ఇప్పుడు, మీ స్మార్ట్‌ ఫోన్‌లోని Microphone కు యాక్సెస్ ఉన్న అన్ని యాప్‌ల లిస్ట్‌ అక్కడ కనిపిస్తుంది.

యాప్‌ల జాబితా నుంచి ఏదైనా ఒక యాప్‌ను ఎంచుకోండి. ఉదాహరణకు YouTube మీద క్లిక్‌ చేయండి. ఇక్కడ మీ మైక్రోఫోన్ యాక్సెస్‌కు సంబంధించిన మూడు ఆప్షన్లు - Allow, Dont allow, Ask every time కనిపిస్తాయి.

ఇప్పుడు మీరు "Ask every time" ఎంచుకోండి. తద్వారా, ఈసారి ఆ యాప్‌ మీ వాయిస్‌ వినాలనుకున్నప్పుడు మొదట మీ అనుమతిని అడుగుతుంది. మీరు అనుమతి ఇస్తేనే మీ మాటలను రికార్డ్‌ చేస్తుంది. ఆ యాప్‌ను మీరు క్లోజ్‌ చేయగానే, మైక్రోఫోన్‌ పర్మిషన్‌ ఆటోమేటిక్‌గా డిసేబుల్‌ అయిపోతుంది. ఒకవేళ మీరు అనుతించకపోతే ఆ యాప్ మీ సంభాషణలను రికార్డ్ చేయలేదు. ఈ సెట్టింగ్‌ వల్ల మీ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

యాప్‌ పనితీరులో తేడా వస్తుందా?మీరు జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్న ప్రతి యాప్‌ విషయంలోనూ ఇదే పద్ధతి అనుసరించండి, ఇది మీ గోప్యతను కాపాడుతుంది & ఏ యాప్ కూడా మిమ్మల్ని అడగకుండా మీ మాటలు వినలేదు. సెట్టింగ్‌ను Ask every time కు మార్చినప్పటికీ యాప్‌ పని తీరులో ఎలాంటి మార్పు ఉండదు, మునుపటిలాగే పని చేస్తుంది. ఇదే విధంగా, మీరు ఫోన్‌లో కెమెరా యాక్సెస్‌ను కూడా నియంత్రించవచ్చు.