Manipur Violence:
ఎంపీల మెమొరాండం
మణిపూర్ పర్యటనలో భాగంగా విపక్ష ఎంపీలు గవర్నర్ అనుసూయ ఉయ్‌కీని కలిశారు. ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో ఆమెతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి తీసుకురావాలని మెమొరాండం ఇచ్చారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మణిపూర్ విషయంలో ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం ఈ విషయంలో ఏదో ఓ పరిష్కారం చూపించేలా జోక్యం చేసుకోవాలని గవర్నర్ అనుసూయను కోరారు. మెమొరాండంపై 21 మంది ఎంపీలు సంతకాలు చేశారు. గత మూడు నెలలుగా రాష్ట్రంలో ఇంటర్నెట్ సర్వీస్‌లను బంద్ చేయడమూ ఎన్నో అనుమానాలకు తావిస్తోందని అన్నారు.
"మణిపూర్‌లో గత 89 రోజులుగా శాంతిభద్రతలు అదుపులోకి రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదో విధంగా పరిష్కారం చూపించేలా మీరు చొరవ చూపించండి. రాష్ట్రంలో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చేలా చూడండి. ఇళ్లు కోల్పోయిన వాళ్లు పునరావాసం కల్పించాలి. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇవ్వడంలో పూర్తిగా విఫలమైపోయింది. బాధితులకు న్యాయం చేయడంలో అన్ని విధాలుగా చర్యలు తీసుకోండి. "
- విపక్ష ఎంపీల మెమొరాండం
5 వేల ఇళ్లు ధ్వంసం..
కేంద్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వమూ హింసాకాండను నియంత్రించలేకపోయాయని మండి పడ్డారు. ఇప్పటి వరకూ అల్లర్లలో 160 మంది ప్రాణాలు కోల్పోగా...500 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 5 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. 60 వేల మంది ప్రజలు వలస వెళ్లిపోయారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఎంపీలు చురచందపూర్‌తో పాటు ఇంఫాల్, మొయిరాంగ్‌లోని బాధితులను పరామర్శించారు. వాళ్ల బాధలు వింటూ చలించిపోయామని చెబుతున్నారు ఎంపీలు. అల్లర్లు మొదలైనప్పటి నుంచి వాళ్లలో ఆందోళన ఇప్పటి వరకూ కొంత కూడా తగ్గలేదని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు తమ భవిష్యత్‌పై చాలా ఆందోళన పడుతున్నట్టు వివరించారు ఎంపీలు.
"మణిపూర్ విషయంలో అన్ని పార్టీలు కలిసి సమస్యని పరిష్కరించేందుకు సహకరించాలని గవర్నర్ కోరారు. పార్లమెంట్‌లో ఇదే అంశాన్ని ప్రస్తావించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అవిశ్వాస తీర్మానాన్ని అంగీకరించాలి. మణిపూర్‌పై చర్చ జరిపించాలి. రోజురోజుకీ అక్కడ పరిస్థితులు దిగజారిపోతున్నాయి"
- అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ