యాపిల్ ‘వండర్‌లస్ట్’ లాంచ్ ఈవెంట్ భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10:30 గంటలకు జరగనుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. అయితే ఏం లాంచ్ కానున్నాయో మాత్రం ఇంకా వెల్లడించలేదు. అయితే గత కొంతకాలంగా దీనికి సంబంధించిన వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఐఫోన్ 15 సిరీస్, కొత్త యాపిల్ వాచ్, యాపిల్ వాచ్ అల్ట్రా మోడల్స్ రానున్నాయని తెలుస్తోంది. దీంతోపాటు ఐవోఎస్ 17 రిలీజ్ డేట్‌ను కూడా కంపెనీ వెల్లడించనుంది.


యాపిల్ ‘వండర్‌లస్ట్’ ఈవెంట్ ఎక్కడ చూడవచ్చు?
ఈ ఈవెంట్‌ కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కంపెనీ యూట్యూబ్ ఛానెల్, యాపిల్.కామ్ వెబ్ సైట్లో కూడా దీన్ని లైవ్ చూడవచ్చు. యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ డెవలపర్ యాప్స్‌లో కూడా దీన్ని స్ట్రీమ్ చేయవచ్చు.


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


యాపిల్ ‘వండర్‌లస్ట్’ ఈవెంట్లో ఏం లాంచ్ కానున్నాయి?
యాపిల్ లాంచ్ ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ కానున్నాయి. వీటిలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయి. ఈ సిరీస్‌లో ఉన్న ఫోన్లలో అప్‌డేటెడ్ ప్రాసెసర్లు ఉండనున్నాయి. అలాగే యూఎస్‌బీ టైప్-సీ పోర్టుతో ఈ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి.


ఐఫోన్ 15 సిరీస్ ధరలు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ లీకైన వివరాల ప్రకారం ఐఫోన్ 15 ధరలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఈ ఫోన్ ప్రారంభ మోడల్ ధర 799 డాలర్లుగా ఉండవచ్చని తెలుస్తోంది. దీన్ని బట్టి ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కావచ్చు. ఐఫోన్ 13, ఐఫోన్ 14 కూడా మనదేశంలో ఇదే ధరతో లాంచ్ అయ్యాయి. ఐఫోన్ 15 ప్లస్ ధరను కూడా యాపిల్ పెంచడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ 899 డాలర్లతో అమెరికాలో లాంచ్ కానుందని తెలుస్తోంది. మనదేశంలో రూ.89,900 ధరతో ఎంట్రీ ఇవ్వవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ వేరియంట్ కూడా ఇదే ధరతో మనదేశంలో లాంచ్ అయింది.


Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?


ప్రో మోడల్స్ ధర ఇలా...
ఐఫోన్ 15 ప్రో ధర భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐఫోన్ 14 ప్రో అమెరికాలో 999 డాలర్ల ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు 1,099 డాలర్ల ధరతో ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఐఫోన్ 14 ప్రో మనదేశంలో గతేడాది రూ.1,29,900 ధరతో లాంచ్ అయింది. మనదేశంలో ఈ ఫోన్ ధర రూ.1,39,900 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ఇది ప్రారంభ స్టోరేజ్ మోడల్ ధర. స్టోరేజ్ పెరిగే కొద్దీ ధర కూడా పెరుగుతుంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 1,099 డాలర్ల ధరతో లాంచ్ అయింది. కానీ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 1,299 డాలర్ల ధరతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. డాలర్లలో చూసుకుంటే 200 డాలర్ల మార్పు ఉండనుంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంచ్ అయినప్పుడు దాని ధర మనదేశంలో రూ.1,39,900గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర ఏకంగా రూ.20 వేల పెంపుతో రూ.1,59,900 ధరతో లాంచ్ అయ్యేలా ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే టాప్ ఎండ్ 1 టీబీ వేరియంట్ ధర రూ.2 లక్షలు దాటినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు.


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial