యాపిల్ వాచ్ అల్ట్రా 2ను కంపెనీ ‘వండర్‌లస్ట్’ ఈవెంట్లో లాంచ్ చేసింది. గతేడాది లాంచ్ అయిన యాపిల్ వాచ్ అల్ట్రాకు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ వాచ్ మార్కెట్లోకి వచ్చింది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 36 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను యాపిల్ వాచ్ అల్ట్రా 2 అందించనుంది. లో ఛార్జింగ్ మోడ్‌లో 72 గంటల వరకు ఉపయోగించుకోవచ్చు. యాపిల్ ఇప్పటివరకు లాంచ్ చేసిన వాచ్‌ల్లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే వాచ్ ఇదే.


యాపిల్ వాచ్ అల్ట్రా 2 ధర
ఈ వాచ్ ధరను మనదేశంలో రూ.89,900గా నిర్ణయించారు. అమెరికాలో దీని ధర 799 డాలర్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.64,000). సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఈ వాచ్ సేల్ ప్రారంభం కానుంది. ఆల్ఫైన్ లూప్, ఓషన్, ట్రెయిల్ లూప్ వాచ్ బ్యాండ్లతో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. యాపిల్ వాచ్ అల్ట్రా కూడా మనదేశంలో ఇదే ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.82,999కు అందుబాటులో ఉంది.


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


యాపిల్ వాచ్ అల్ట్రా 2 స్పెసిఫికేషన్లు
యాపిల్ వాచ్ అల్ట్రా 2లో 49 ఎంఎం కేస్‌ను అందించారు. ఏకంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ డిస్‌ప్లే అందించనుంది. టైటానియం బాడీతో ఈ వాచ్‌ను రూపొందించారు. దీని ముందు వెర్షన్‌లో ఉన్న యాక్షన్ బటన్‌ను ఇందులో కూడా కొనసాగించారు. దీని ద్వారా ఎన్నో ఫీచర్లు ఉపయోగించుకోవచ్చు. యాపిల్ వాచ్ సిరీస్ 9 తరహాలోనే ఇందులో కూడా కంపెనీ కస్టం ఎస్9 ఎస్ఐపీ చిప్‌సెట్‌ను అందించారు. ఆన్ డివైస్ సిరి ప్రాసెసింగ్, మెరుగైన లొకేషన్ ట్రాకింగ్ కూడా ఈ వాచ్‌లో ఉన్నాయి.


వాచ్ఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టంపై యాపిల్ వాచ్ అల్ట్రా 2 పని చేయనుంది. యాపిల్ వాచ్ సిరీస్ 9లో ఉన్న జెస్చర్ ఫీచర్ ఇందులో కూడా ఉంది. దీని ద్వారా యూజర్లు వాచ్ డిస్‌ప్లేను టచ్ చేయకుండానే ఒక్క చేత్తో వాచ్‌ను కంట్రోల్ చేయవచ్చు. కొండలు ఎక్కేవారు, హైకింగ్ చేసే వారి కోసం ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ఆల్టిట్యూడ్ రేంజ్‌ను సముద్ర మట్టం కంటే 500 మీటర్ల కిందకు, 9000 మీటర్లు పైకి అందించారు. వాటర్ స్పోర్ట్స్ ఆడేవారి కోసం 40 మీటర్ల వరకు డైవింగ్ డెప్త్ కూడా ఉంది.


ఒక్కసారి చార్జింగ్ పెడితే నార్మల్ మోడ్‌లో 36 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను యాపిల్ వాచ్ అల్ట్రా 2 అందించనుంది. లో పవర్ మోడ్ ఆన్ చేస్తే ఏకంగా 72 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. యాపిల్ వాచ్ అల్ట్రా 2లో మాడ్యులర్ అల్ట్రా అనే కొత్త వాచ్ ఫేస్‌ను కూడా అందించారు.


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial