Apple Pencil 3: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ తన తదుపరి తరం పెన్సిల్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే యాపిల్ పెన్సిల్ 3. ఈ కొత్త పెన్సిల్ యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఈ కొత్త యాపిల్ పెన్సిల్ 3 యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌తో కూడిన స్లైడింగ్ క్యాప్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇప్పుడు యాపిల్ పెన్సిల్‌ను ఐప్యాడ్‌తో పెయిర్ చేయడం ఇంతకు ముందు వెర్షన్లతో పోలిస్తే చాలా సులభం అవుతుంది. అలాగే ఐప్యాడ్ సైడ్ ఎడ్జ్‌కు ఈ పెన్సిల్‌ను సురక్షితంగా అటాచ్ చేయవచ్చు.


యాపిల్ పెన్సిల్ 3 ధర
యాపిల్ పెన్సిల్‌ 3ని మనదేశంలో రూ.7,900 ధరకు విడుదల చేసింది. దీనికి సంబంధించిన సేల్ ఇప్పటికే మనదేశంలో ప్రారంభం అయింది. యాపిల్ కంపెనీ అధికారిక వెబ్ సైట్ నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు. అలాగే గతేడాది విడుదల చేసిన 10వ తరం పెన్సిల్‌తో పోలిస్తే దీని ధర చాలా తక్కువ. యాపిల్ దీని ముందు వెర్షన్ పెన్సిల్‌ను గత సంవత్సరం రూ. 11,900 ధరతో మార్కెట్లో లాంచ్ చేసింది. యాపిల్ పెన్సిల్ కొత్త మోడల్ ధర తగ్గినప్పటికీ, అడ్వాన్స్‌డ్ ఫీచర్లను కలిగి ఉంది. ప్రెజర్ సెన్సిటివిటీ, వైర్‌లెస్ పెయిరింగ్, ఛార్జింగ్, డబుల్ ట్యాప్ ఫంక్షన్ వంటి కొన్ని ఫీచర్లు మాత్రం ఇందులో లేవు.


యాపిల్ పెన్సిల్ 3 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
కొత్త యాపిల్ పెన్సిల్ 3... ఇంతకు ముందు లాంచ్ అయిన ఐప్యాడ్ (10వ తరం), ఐప్యాడ్ ఎయిర్ (4వ, 5వ తరం), 11 అంగుళాల ఐప్యాడ్ ప్రో (1వ, 2వ, 3వ, 4వ తరం), ఐప్యాడ్ ప్రో వంటి యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌తో కూడిన అనేక ఐప్యాడ్ మోడల్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 12.9 అంగుళాల (3వ, 4వ, 5వ, 6వ తరం), ఐప్యాడ్ మినీ (6వ తరం)లను కూడా ఈ యాపిల్ పెన్సిల్ 3 ద్వారా ఆపరేట్ చేయవచ్చు.


యాపిల్ తన ఎడ్యుకేషన్ ప్లాన్ కింద విద్యార్థులకు ఆఫర్‌లను కూడా ఇచ్చింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ కొత్త యాపిల్ పెన్సిల్ 3 రూ.6,999కే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ఉద్యోగులు, అన్ని గ్రేడ్‌ల హోమ్ స్కూల్ ఉపాధ్యాయులు ఉపయోగించుకోవచ్చు.


అయితే యాపిల్ తన చవకైన ఐప్యాడ్‌ను త్వరలో విడుదల చేయనుందని రూమర్లు వస్తున్నాయి. కానీ ఇంకా అవి లాంచ్ కాలేదు. 2022 అక్టోబర్‌లో యాపిల్ 10వ తరం ఐప్యాడ్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే నెలలో ఎం2 చిప్‌తో కూడిన ఐప్యాడ్ ప్రోని కూడా యాపిల్ లాంచ్ చేసింది. ఎం1 చిప్‌తో కూడిన ఐప్యాడ్ ఎయిర్ 2022 మార్చిలో మార్కెట్‌లోకి వచ్చింది. అలాగే 2021 సెప్టెంబర్‌లో ఐప్యాడ్ మినీ రీడిజైన్డ్ మోడల్ లాంచ్ అయింది.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?