Adilabad News : రైతుబంధు, దళిత బంధు పథకాలు రాలేదని ఆదిలాబాద్ జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం ఉద్రిక్తతకు కారణం అయింది. ఆదిలాబాద్ రిమ్స్ మార్చురీ ముందు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బొరజ్ గ్రామానికి చెందిన రమాకాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రిమ్స్ మార్చురీ ఎదుట న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఘటన స్థలానికి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, డిఎస్పీ ఉమెందర్ చేరుకొని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నిరసనకారులు వినలేదు.
ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నామినేషన్లు స్వకరించే ప్రాంతానికి మృతదేహాన్ని తీసుకెళ్తామని.. బంధువులు పట్టుబట్టారు. అయితే ఎస్పీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. తోపులాట జరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దళితబంధు రావట్లేదని రమాకాంత్ అనే యువకుడు గురువారం జైనథ్ మండలం బోరజ్ చెక్ పోస్ట్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు సీఎం కారణమే అని పత్రంలో రాశారు.
బాధిత కుటుంబానికి దళితబంధుతో పాటు సంక్షేమ పథకాలు అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని దళిత సంఘాల నాయకులు నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం రిమ్స్ మార్చురీ ఎదుట ఆందోళనకు దిగి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ రావాలంటూ పట్టుబడ్డారు. అయితే జిల్లా ఎస్పీ ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేసారు. అయిన వారు వినకపోవడంతో వారినీ అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా ఎస్పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ రైతు మృతికి గల కారణాలు పూర్తి విచారణ చేయడం జరుగతుందన్నారు. సూసైడ్ నోట్లో కూడా పరిశీలించి అతని రైటింగ్ను పరిశీలన చేసి అతనే రాశాడా లేదా ఎవరైనా రాసి పెట్టారా అనేది కూడా పరిశీలన చేయడం జరుగుతుందని, కుటుంబ సభ్యులేవరు ఆందోళనకు గురికావద్దని, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉదృతం చేస్తామన్నారు.