Telangana Assembly Election 2023: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారులు ఫారం - 1 నోటీసును జారీ చేసిన అనంతరం నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియ ఈ నెల 10 వరకూ కొనసాగనుంది. 13న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 15 వరకు గడువు ఉంటుంది. ఈ మేరకు నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. ఈ నెల 10 వరకు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల‌ వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చెయ్యొచ్చు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోపు ఒక్కో అభ్యర్థికి సంబంధించిన 3 వాహనాలు, ఐదుగురు వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారు. వారాలు, వర్జ్యాలు, ముహూర్తాలు, తిథుల ప్రకారం ఈనెల 7, 9  తేదీల్లోనే ఎక్కువ మంది నామినేషన్ వేసే అవకాశం ఉంది. 


అభ్యర్థులకు సూచనలివే


శుక్రవారం ఉదయం నుంచి ఈ నెల 10 వరకు ప్రతి రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌తో పాటుగా నిర్దేశిత ఫారం–26 అందించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వద్దకు అభ్యర్థి వెంట నలుగురికి అనుమతిస్తారు. నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, విద్యా అర్హత వివరాలు పత్రాలను దాఖలు చేయాలి. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి దాఖలుకు ఒకరోజు ముందు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ECకి వెల్లడించాలి. కొత్త బ్యాంక్ అకౌంట్ లోనే అభ్యర్థి ఖర్చు వివరాలను తెలపాలి.


సువిధా యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేసే సదుపాయాన్ని ఈసీ కల్పించింది. ఆన్లైన్ లో దాఖలు తరువాత పత్రాలను సంతకాలు చేసి ఆర్వోకు అందించాలి. ప్రతిరోజు సాయంత్రం 3 గంటల తరువాత ఆర్వో రోజు వారీ నామినేషన్ వివరాలను వెల్లడిస్తారు. ప్ర తిరోజు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడేవిట్ పత్రాలను డిస్ ప్లే చేస్తారు. నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి అఫిడేవిట్ పత్రాలను 24 గంటల్లోనే CEO వెబ్సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. 15వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.  


ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్


రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో నవంబర్‌ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలో మొత్తం 35,356 కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. త్వరలో ప్రకటించనున్న అనుబంధ జాబితాతో ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.  


ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మంది ఐఏఎస్‌ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది. శాంతి భద్రతల పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాట్లు, పరిపాలన, పోలీసు విభాగాల మధ్య సమన్వయం కోసం 39 మంది ఐపీఎస్‌ అధికారులను నియమించింది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిఘా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న సుమారు 50 మందిని వ్యయ పరిశీలకులుగా నియమించింది. 


అన్ని జిల్లాల్లో వీడియో నిఘా బృందాలు, వీడియో వ్యూయింగ్‌ టీమ్‌లు, అకౌంటింగ్‌ బృందాలు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్, స్టాటిక్‌ సర్వైలియన్స్‌ టీంలు, ఖర్చుల పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. 4 రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే 17 జిల్లాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. 89 పోలీసు చెక్‌పోస్టులు, 14 రవాణా, 16 వాణిజ్య పన్నులు, 21 ఎక్సైజు, 8 అటవీ శాఖ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది.  అలాగే ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఓటర్ల జాబితాలు ప్రకటన, సవరణలు చేయడం, ఈవీఎంలు సిద్ధం చేయడం, పోలింగ్‌ అధికారులు, సిబ్బంది నియామకం, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, కనీస సదుపాయాల కల్పన, దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాల కల్పన, భద్రత ఏర్పాట్లను పూర్తి చేసింది.