Why Vinod Kambli Career Ended Early: తొలి బంతికే సిక్సర్ బాది రంజీ ట్రోఫీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆటగాడు వినోద్ కాంబ్లీ. స్కూలు రోజుల్లో రమాకాంత్ ఆచ్రేకర్ వద్ద సచిన్ టెండూల్కర్‌తో పాటు కాంబ్లీ శిక్షణ పొందాడు. స్కూల్ క్రికెట్‌లో శారధాదామం తరఫున సచిన్‌తో కలసి 664 పరుగుల భారీ భాగస్వామ్యం అందించడంతో జాతీయ స్థాయిలో వీరి పేర్లు మార్మోగాయి. ఆ భాగస్వామ్యంలో అత్యధిక వాటా 349 స్కోర్ కాంబ్లీదే కాగా, ఆ మ్యాచ్‌లో బంతితోనూ అద్భుతం చేశాడు. 6 వికెట్లు పడగొట్టి ఆల్ రౌండ్ నైపుణ్యం ప్రదర్శించాడు.
నేడు వినోద్ కాంబ్లీ బర్త్‌డే సందర్భంగా కొన్ని విశేషాలు ఇక్కడ అందిస్తున్నాం. వాస్తవానికి సచిన్ టెండూల్కర్ కన్నా వినోద్ కాంబ్లీ ద్వారానే తనకు ఎక్కువ పేరు, గౌరవ మర్యాదలు వస్తాయని చిన్ననాటి కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ భావించేవారట. కానీ సచిన్‌కు టీమిండియాకు త్వరగా అవకాశం వచ్చింది, ఆపై మూడేళ్లకు కాంబ్లీకి జాతీయ క్రికెట్ జట్టు నుంచి పిలుపొచ్చింది. అతడి జీవనశైలి కారణంగానే కాంబ్లీ కెరీర్ కేవలం 28 ఏళ్ల వయసులోనే ముగిసిందని సచిన్, కపిల్ దేవ్ లాంటి దిగ్గజాలు చెబుతుండేవారు. సంప్రదాయ క్రికెట్‌గా భావించే టెస్టుల్లో మెరుగైన రికార్డులు అతడి సొంతం. సచిన్ సైతం అంతలా ఆడలేదని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే భారత్ తరఫున కొన్ని రికార్డులు కాంబ్లీ పేరిటే ఉన్నాయి.
కాంబ్లీ కెరీర్‌కు శాపంగా మారిన వన్డే..
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కాంబ్లీకి ఓ మ్యాచ్ అద్భుత అవకాశంగా మారింది. కానీ అదే వన్డే మ్యాచ్ అతడి కెరీర్‌లో చివరిదైంది. ఏకంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. టీమిండియా వన్డే చరిత్రలో అదో మాయని మచ్చగా మిగిలిన మ్యాచ్‌తో వినోద్ కాంబ్లీ కెరీర్ ముగిసింది. 29 అక్టోబర్ 2000లో షార్జా వేదికగా శ్రీలంక, భారత్ వన్డే మ్యాచ్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్ ఫలితాన్ని సగటు భారత క్రికెట్ ప్రేమికుడు జీర్ణించుకోలేదు. లంక జట్టు ఓపెనర్, కెప్టెన్ సనత్ జయసూర్య (189) భారీ శతకం సాధించడంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు 5 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. కానీ ఛేజింగ్‌లో లంక బౌలర్ల ధాటికి కేవలం 54 పరుగులకే భారత జట్టు ఆలౌటైంది.
సచిన్, సౌరవ్, యువరాజ్ సింగ్ 3 పరుగుల చొప్పున చేయగా.. వినోద్ కాంబ్లీ సైతం 3 పరుగులే చేశాడు. అప్పటికే పలుమార్లు జట్టులోకి వస్తూ పోతూ ఉన్న కాంబ్లీ ఆ మ్యాచ్‌లో సత్తా చాటి ఉంటే అతడికి మరిన్ని అవకాశాలు వచ్చేవి. కానీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం, ఫామ్ కోసం తంటాలు పడుతున్న ఆటగాడు మరోసారి వైఫల్యం చెందడంతో కాంబ్లీ కెరీర్‌లో అదే చివరి మ్యాచ్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌లో పుట్టినరోజు నాడు వన్డేల్లో శతకం బాదిన తొలి క్రికెటర్ వినోద్ కాంబ్లీ కావడం వివేషం.
మరోవైపు టెస్టుల్లో అద్భుతంగా రాణించిన కాంబ్లీ కెరీర్ అక్కడ సరిగ్గా మూడేళ్లు కూడా సాగలేదు. టెస్టుల్లో కేవలం 14 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు సాధించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 1000 టెస్ట్ పరుగులు చేసిన టీమిండియా ఆటగాడిగా అతడి పేరట రికార్డ్ ఉంది. వినోద్ కాంబ్లీ తన తొలి 8 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు సాధించాడు. ఓవరాల్‌గా 17 టెస్టుల్లో 54.20 సగటుతో 1084 పరుగులు చేశాడు. బౌన్సర్లు ఎదుర్కోవడంలో టెక్నిక్ తెలుసుకోకపోవడం, జీవనశైలి మార్చుకోని కారణంగా 30 ఏళ్ల వయసు రాకముందే క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
Also Read: Mohammed Siraj on Kohli: నువ్వెప్పుడూ నా కెప్టెనే! ధోనీకి కోహ్లీ.. కోహ్లీకి సిరాజ్!
Also Read: Virat Kohlis Successor: టీమిండియా టెస్టు పగ్గాలు అతడి చేతికే.. రోహిత్ శర్మకు మాత్రం నో ఛాన్స్!