ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. సమంత-నాగచైతన్య విడాకుల సంగతి అభిమానులు జీర్ణించుకోకముందే మరో స్టార్ కపుల్ డివోర్స్ తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేసింది. వారెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్. 18 ఏళ్ల తమ దాంపత్య జీవితానికి ఈ జంట స్వస్తి పలికింది. అసలు వీరెందుకు విడిపోయారనే విషయం మాత్రం బయటకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విడాకుల విషయంపై స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ లో పలు ట్వీట్స్ పెట్టారు. 'సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటూ.. ట్రెండ్ సెట్ చేయడమే కాకుండా పెళ్లిళ్లు ఎంత ప్రమాదకరమో యంగ్ జెనరేషన్ కి వార్నింగ్ ఇస్తున్నారు' అంటూ ఓ ట్వీట్ పెట్టారు. 'సంతోషంగా ఉండడానికి వీలైనంత ఎక్కువ ప్రేమించండి.. ప్రేమ లేనప్పుడు మూవ్ ఆన్ అయిపోండి కానీ పెళ్లి అనే జైలుకి మాత్రం వెళ్లొద్దు' అంటూ మరో ట్వీట్ లో రాసుకొచ్చారు.
'స్మార్ట్ పీపుల్ ప్రేమిస్తారు.. మూర్ఖులే పెళ్లి చేసుకుంటారు' అంటూ వరుసగా ట్వీట్స్ వేశారు వర్మ. వర్మ చెప్పినదాంట్లో కూడా పాయింట్ ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి సమయంలో నీ ఫిలాసఫీ అవసరమా..? అంటూ వర్మను విమర్శిస్తున్నారు.
Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులు.. అఫీషియల్ ప్రకటన!