ఈ టీ20 వరల్డ్ కప్‌లో నెట్ రన్ రేట్(ఎన్ఆర్ఆర్) చాలా కీలకం అయింది. ఇందులోనే కాకుండా ఐపీఎల్, ఐసీసీ టోర్నమెంట్లలో ఈ నెట్ రన్‌రేట్ గురించి మనం వినే ఉంటాం. అసలు ఈ నెట్ రన్‌రేట్ అంటే ఏంటి? దీన్ని లెక్కించడం అంత కష్టమా?
నిజానికి నెట్ రన్‌రేట్‌ను లెక్కించడం అంత కష్టమేమీ కాదు. మ్యాచ్‌లో ఓవర్‌కు తాము చేసిన యావరేజ్ స్కోరు నుంచి ప్రత్యర్థి జట్టు ఓవర్‌కు చేసిన యావరేజ్ పరుగులను తీసేస్తే అదే నెట్ రన్‌రేట్. టోర్నీ మొత్తానికి నెట్ రన్‌రేట్‌ను కూడా ఇలాగే లెక్కిస్తారు.
ఒకవేళ పూర్తి కోటా ఓవర్లలోపే ఆలౌట్ అయితే కేవలం పదో వికెట్‌ను కోల్పోయినప్పుడు ఓవర్లను కాకుండా పూర్తి ఓవర్లను ఆడినట్లు లెక్కలోకి తీసుకుంటారు. కేవలం ఫలితాలు వచ్చిన మ్యాచ్‌ల్లో మాత్రమే నెట్ రన్ రేట్ లెక్కిస్తారు.
కొన్ని పరిస్థితుల వల్ల మ్యాచ్ ఆగిపోయి, డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజేతను నిర్ణయించాల్సి వచ్చినప్పుడు.. రెండో సారి బ్యాటింగ్ చేసే జట్టు మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఎంత పరుగులు చేయాలో(డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) ఆ స్కోరును మొదట బ్యాటింగ్ చేసిన జట్టు స్కోరుగా పరిగణిస్తారు.
ఒకవేళ మ్యాచ్ ఆగిపోయి.. కాసేపటికి తిరిగి ప్రారంభమై, అప్పుడు డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో లక్ష్యాన్ని సవరిస్తే.. రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టు లక్ష్యానికి ఒక్క పరుగు తగ్గించి.. దాన్ని మొదట బ్యాటింగ్ చేసిన జట్టు స్కోరుగా పరిగణిస్తారు.
ఈ టీ20 వరల్డ్ కప్‌లో భారత్ నెట్‌రన్‌రేట్‌ను ఉదాహరణగా తీసుకుందాం. భారత్ సూపర్-12 రెండో గ్రూప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించింది.
ఈ మ్యాచ్‌ల్లో భారత్ సాధించిన స్కోర్లు ఇలా ఉన్నాయి.
1. పాకిస్తాన్‌పై - 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
2. న్యూజిలాండ్‌పై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.
3. ఆఫ్ఘనిస్తాన్‌పై 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.
4. స్కాట్లాండ్‌పై 6.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది.
ఈ నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ 66.3(లెక్కించేటప్పుడు 66.5) ఓవర్లలో 560 పరుగులు చేసింది. అంటే 560/66.5 వేస్తే ఓవర్‌కు 8.421 పరుగులు చేసినట్లు అన్నమాట.
ఇక ప్రత్యర్థి జట్లకు ఇచ్చిన స్కోర్లు చూస్తే..
1. పాకిస్తాన్‌కు 17.5 ఓవర్లలో 152 పరుగులు ఇచ్చింది.
2. న్యూజిలాండ్‌కు 14.3 ఓవర్లలో 111 పరుగులు ఇచ్చింది.
3. ఆఫ్ఘనిస్తాన్‌కు 20 ఓవర్లలో 144 పరుగులు ఇచ్చింది.
4. స్కాట్లాండ్‌ను 17.4 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ చేసింది.(ఆలౌట్ చేశారు కాబట్టి స్కాట్లాండ్ 20 ఓవర్లు ఆడినట్లే లెక్కించాలి)
ఈ నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ 72.2(లెక్కించేటప్పుడు 72.333) ఓవర్లలో 492 పరుగులు చేసింది. అంటే 492/72.333 వేస్తే ఓవర్‌కు 6.802 పరుగులు ఇచ్చినట్లు అన్నమాట.
ఇప్పుడు భారత్ చేసిన రన్‌రేట్‌లో నుంచి, ఇచ్చిన రన్‌రేట్‌ను తీసేయాలి. అంటే 8.421లో నుంచి 6.802ను తీసేయాలన్న మాట. అలా తీసేస్తే +1.619 వస్తుంది. ప్రస్తుతం భారత్ నెట్ రన్‌రేట్ ఇదే. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్‌పై విజయం సాధించి ఉంటే.. అప్పుడు ఈ నెట్‌రన్‌రేట్ అత్యంత కీలకం అయ్యేది. అసలు ఇలాంటి సమీకరణాలతో బుర్ర పాడు చేసుకోకుండా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలిచి నాకౌట్ దశకు చేరడంపైనే ఇకపై భారత్ దృష్టి పెట్టాలి.