విరాట్‌ కోహ్లీ మూడు నెలలు విరామం తీసుకుంటే మంచిదని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి సూచిస్తున్నాడు. దీనివల్ల అతడు ఆటను మరింత ఎక్కువ ఏకాగ్రతతో ఆడగలడని పేర్కొన్నాడు. విరామం తర్వాత అతడు రారాజులా క్రికెట్‌ ఆడతాడని అంచనా వేశాడు. షోయబ్‌ అక్తర్‌ యూట్యూబ్‌ ఛానళ్లో అతడు మాట్లాడాడు.


'తనకు 33 ఏళ్లు నిండాయని విరాట్‌ కోహ్లీ గుర్తించాడు. మరో ఐదేళ్లు క్రికెట్‌ ఆడగలనని అతడికి తెలుసు. అతడు ప్రశాంతంగా ఉండి, బ్యాటింగ్‌పై దృష్టి పెడితే, ఒకసారి ఒక మ్యాచ్‌నే లక్ష్యంగా ఎంచుకుంటే, ఆట నుంచి విరామం తీసుకుంటే బాగుంటుంది. అతడో రెండు మూడు నెలలు ఇంటివద్దే ఉంటే లేదా ఒక సిరీసు నుంచి విరామం తీసుకుంటే అతడికి మంచి చేస్తుందని అనుకుంటున్నా' అని రవిశాస్త్రి అన్నాడు.


Also Read: IND vs WI: అనిల్‌ సర్‌ పాఠాలతోనే ఎదిగానన్న రవి బిష్ణోయ్‌! విండీస్‌తో తలపడే టీ20, వన్డే జట్లివే


Also Read: Rohit Sharma Health: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ టెస్టు పాస్‌.. ఇక 'హిట్టింగే హిట్టింగు'!


రాబోయే మూడునాలుగేళ్లలో విరాట్‌ కోహ్లీ రారాజులా క్రికెట్‌ ఆడగలడని రవిశాస్త్రి అంచనా వేశాడు. అంతకన్నా ముందు తన పాత్రపై స్పష్టత తెచ్చుకోవాలని సూచించాడు. ఆటగాడిగా అతడు టీమ్‌ఇండియాకు మ్యాచులు గెలిపించగలడని ధీమా వ్యక్తం చేశాడు.


'విరామం నుంచి తిరిగొచ్చి మూడునాలుగేళ్లు రారాజులా ఆడాలి. అందుకు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. తన పాత్రేంటో తెలుసుకోవాలి. ఒక జట్టు ఆటగాడిగా గొప్పగా ఉండాలి. జట్టుకు విలువైన భాగస్వామ్యాలు అందించి విజయాలను చేకూర్చాలి' అని శాస్త్రి అన్నాడు.


విరాట్‌ కోహ్లీ నుంచి అభిమానులు శతకాలను ఆశిస్తున్నారు. అతడు సెంచరీ చేసి మూడేళ్లైంది. తన బ్యాటుతో విలువైన భాగస్వామ్యాలు అందిస్తున్నా సెంచరీ కోసమే ఫ్యాన్స్‌ కలగంటున్నారు. దక్షిణాఫ్రికా సిరీసు ముందు అతడి కెరీర్లో కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసు ముగియగానే టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. త్వరలో అతడు వెస్టిండీస్ సిరీసులో ఆడబోతున్నాడు.