జిల్లాల పునర్విభజనలో నెల్లూరు జిల్లా రెండు భాగాలుగా మారుతోంది. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంగా బాలాజీ పేరుతో కొత్త జిల్లా ఏర్పడుతుంది. వాస్తవానికి ఇలా ఏర్పడే కొత్త జిల్లాలో నెల్లూరు జిల్లా నుంచి వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాలు చేరాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలోనే ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్లా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగానే విభజన జరిగినా.. కొన్ని చోట్ల మాత్రమే కాస్త వెసులుబాటు ఇచ్చారు. అలాంటివాటిలో నెల్లూరు ఒకటి. 


సర్వేపల్లి వెళ్లిపోతే ఏంటి నష్టం..?
సర్వేపల్లి నియోజకవర్గం వాస్తవానికి నెల్లూరు నగరం చుట్టూ విస్తరించి ఉంటుంది. ఈ నియోజకవర్గాన్ని తిరుపతిలో చేర్చడం పూర్తిగా అనాలోచిత చర్యే అవుతుంది. ప్రస్తుతం గూడూరు నియోజకవర్గ ప్రజలే తమని తిరుపతిలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దూరాభారం పెరుగుతుందని అంటున్నారు. అలాంటిది సర్వేపల్లిని కూడా చేర్చితే మరిన్ని తలనొప్పులు ఎదురయ్యేవి. 


అన్నిటికంటే ముఖ్యం కృష్ణపట్నం పోర్టు..
నెల్లూరు జిల్లా రెండుగా విడిపోతే.. ఉమ్మడి జిల్లానుంచి కృష్ణపట్నం పోర్ట్, శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం, జిల్లాలోని పారిశ్రామిక కారిడార్ అంతా తరలిపోయేవి. కృష్ణపట్నం పోర్ట్ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంది. ఇప్పటికే షార్ అంతరిక్ష కేంద్రం, సెజ్ లు తిరుపతికి వెళ్లిపోయాయి. సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కూడా తిరుపతి కేంద్రంగా ఏర్పడే బాలాజీ జిల్లాలో కలిస్తే అప్పుడు నెల్లూరు జిల్లాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న కృష్ణపట్నం కూడా తరలి వెళ్లిపోయేది. కానీ ఆ ఇబ్బంది లేకుండా సర్వేపల్లిని నెల్లూరులోనే ఉంచుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి  అసలు కారణం సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అని అంటున్నారు స్థానికులు. ఆయన చొరవ వల్లే కృష్ణపట్నం పోర్ట్ సహా 22 పెద్ద, మధ్యతరహా పరిశ్రమలు నెల్లూరునుంచి తరలిపోకుండా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. 




గతంలో కూడా జిల్లాల విభజన అంశం తెరపైకి వచ్చినప్పుడు సర్వేపల్లిని నెల్లూరులోనే ఉంచేలా కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మరోసారి జిల్లాల విభజన అంశంలో ఆయన సీఎం జగన్ కు లేఖ ద్వారా పూర్తి సమాచారాన్ని అందించారు.




సర్వేపల్లిని తిరుపతిలో కలిపేస్తే.. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న సింహపురి యూనివర్శిటీ కూడా జిల్లాకు దక్కేది కాదు. మత్స్య కళాశాల, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం కూడా చేజారేవి. కృష్ణపట్నం పోర్ట్ తోపాటు.. వీటన్నిటినీ జిల్లానుంచి వేరు చేయకుండా చూడాలని సీఎం జగన్ కి కాకాణి లేఖ రాశారు. దీంతో సర్వేపల్లి నియోజకవర్గాన్ని మాత్రం తిరుపతి కేంద్రంగా ఏర్పడే జిల్లానుంచి మినహాయించారు. కాకాణి వల్లే నె్ల్లూరు జిల్లా ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పోర్ట్ ని కోల్పోకుండా ఉందని అంటున్నారు జిల్లా వైసీపీ నాయకులు.