టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడంతో యువ క్రికెటర్‌ రవి బిష్ణోయ్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తనను మెరుగైన స్పిన్నర్‌గా తీర్చిదిద్దడంలో అనిల్‌ కుంబ్లే పాత్ర ఎంతైనా ఉందని పేర్కొన్నాడు. అవకాశం ఎప్పుడొచ్చినా అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలో కొత్త ఫ్రాంచైజీకి ఆడేందుకు ఎదురు చూస్తున్నానని వెల్లడించాడు.

వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీసులకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ బుధవారం రాత్రి టీమ్‌ఇండియాను ఎంపిక చేసింది. యువ క్రికెటర్‌ రవి బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకుంది. అతడితో పాటు కుల్‌దీప్‌ యాదవ్‌ తిరిగి పునరాగమనం చేయబోతున్నాడు. పనిభారం దృష్ట్యా జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ షమికి విశ్రాంతినిచ్చారు. సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌కూ రెస్ట్‌ ఇచ్చారు. రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ పరీక్ష నెగ్గి పగ్గాలు అందుకున్నాడు. రవీంద్ర జడేజా ఇంకా గాయం నుంచి కోలుకుంటున్నాడు. టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడంతో రవి బిష్ణోయ్ ఇంటి వద్ద నిన్న రాత్రి సందడి నెలకొంది. చుట్టుపక్కల వాళ్లు డోలు వాద్యాలు వాయిస్తూ వేడుక చేసుకున్నారు.

'అనిల్‌ సర్‌ వద్ద నేనెన్నో పాఠాలే నేర్చుకున్నాను. నేను మెరుగైన క్రికెటర్‌గా మారేందుకు ఆ పాఠాలే సాయం చేశాయి. నన్ను నేను ప్రోత్సహించుకొనేలా ఆయన నాకు మార్గనిర్దేశం చేశారు. ఒత్తిడిలో ఆశలు వదిలేయద్దని నేర్పించారు. అవన్నీ నాకు ఉపయోగపడ్డాయి. నేను అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఐపీఎల్‌ లీగుకు సిద్ధమవుతున్నాను. అవకాశం రాగానే వంద శాతం శ్రమించాలని అనుకున్నాను. మెరుగ్గా ఆడుతూ అవకాశం కోసం ఎదురు చూడటమే నా లక్ష్యం' అని రవి బిష్ణోయ్‌ అన్నాడు.

ప్రస్తుతం రవి బిష్ణోయ్‌ వయసు 21 ఏళ్లు. అతడు పంజాబ్‌ కింగ్స్‌ను వదిలేసి లక్నో సూపర్‌జెయింట్స్‌కు చేరుకున్నాడు. మళ్లీ కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోనే ఆడుతుండటం సంతోషంగా ఉందని అంటున్నాడు. 'నేనిప్పటికే పంజాబ్‌ కింగ్స్‌లో రాహుల్ సారథ్యంలో ఆడాను. అతడి నేతృత్వంలో ఆడటం సౌకర్యంగా ఉంటుంది. వేలానికి ముందు లక్నో ఫ్రాంచైజీ ఎంచుకొన్న కొద్దిమంది ఆటగాళ్లలో నేనుండటం సంతోషకరం. అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తాను' అని బిష్ణోయ్ అన్నాడు.

'నా విజయంలో కుంబ్లే సర్‌ పాత్ర ఎంతైనా ఉంది. నా బలానికి అనుగుణంగా ఆడాలని ఆయన చెప్పారు. నా బేసిక్స్‌కు కట్టుబడి ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. స్వేచ్ఛగా ఆడేందుకు ఆత్మవిశ్వాసం అందించారు' అని ఈ యువ లెగ్ స్పిన్నర్‌ పేర్కొన్నాడు.

టీమ్‌ఇండియా వన్డే జట్టు: రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శిఖర్ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, రిషభ్ పంత్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ

టీమ్‌ఇండియా టీ20 జట్టు: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, రవి బిష్ణోయ్‌, అక్షర్‌ పటేల్‌, యుజ్వేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్, భువనేశ్వర్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌