తెలంగాణ ఆర్టీసీ సంస్థలో జరుగుతున్న సంస్కరణల్లో భాగంగా కీలకమైన వెబ్ సైట్ మార్పు జరిగింది. ప్రయాణికులు సొంతగా బస్సు టికెట్లు బుక్ చేసుకొనే పాత సైట్ స్థానంలో కొత్త వెబ్ సైట్‌ను ఆవిష్కరించారు. ఈ కొత్త వెబ్‌సైట్ బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ బాజీ రెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ కొత్త వెబ్ సైట్‌ను ప్రారంభించారు. దీంతో టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ పోర్టల్ ఇక నుంచి మారినట్లయింది. అంతకుముందు హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనార్ పాల్గొన్నారు. అనంతరం అధికారులు, సిబ్బందికి గణతంత్ర శుభాకాంక్షలు చెప్పారు.
ఈ వేడుకల అనంతరం ఆర్టీసీ కొత్త వెబ్ సైట్‌ను ఛైర్మన్ ప్రారంభించారు. పాత వెబ్ సైట్‌ను కాస్త మార్చి కొత్త హంగులను జోడించి tsrtc.telangana.gov.in అనే వెబ్ సైట్‌ను తీర్చి దిద్దారు. ఈ కొత్త వెబ్ సైట్ ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునేందుకు చాలా సులువుగా ఉంటుందని వారు తెలిపారు. సామాన్యులు కూడా ఈ కొత్త వెబ్ సైట్‌ను వినియోగించేలా ఉంటుందని చెప్పారు. అలాగే ప్రజలు అందరూ కూడా టీఎస్ ఆర్టీసీ కొత్త వెబ్ పోర్టల్‌ను సందర్శించాలని కోరారు. అలాగే ప్రయాణీకుల సూచనలు, అభిప్రాయాలను కూడా ఈ వెబ్ సైట్ ద్వారా తమ దృష్టికి తీసుకురావచ్చని అన్నారు. అందుకోసం వెబ్ సైట్‌లో ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఐపీఎస్ అధికారి అయిన వీసీ సజ్జనార్ ఎప్పటికప్పుడు టీఎస్ ఆర్టీసీలో నూతన సంస్కరణలు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీలో వినూత్నమైన విధానాలతో ముందుకు పోతున్నారు. సోషల్ మీడియాలోనూ ప్రయాణికులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.