భారత క్రికెట్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీ20 క్రికెట్‌ సారథిగా తప్పుకుంటున్నానని మొన్నే విరాట్‌ కోహ్లీ ప్రకటించాడు. పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌ తర్వాత కోచ్‌ రవిశాస్త్రి వీడ్కోలు పలకబోతున్నాడు. దాంతో అనిల్‌ కుంబ్లే మళ్లీ కోచ్‌ పదవి రేసులోకి వచ్చాడు. లేదంటే వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఎంపికవ్వడం ఖాయమేనని తెలుస్తోంది.


మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే 2016 నుంచి ఏడాది కాలం టీమ్‌ఇండియా కోచ్‌గా పనిచేశారు. సచిన్‌ తెందూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ ఆయనను ఎంపిక చేసింది. జంబో నేతృత్వంలో భారత జట్టు ఘన విజయాలే అందుకొంది. కానీ ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత అతడు రాజీనామా చేశాడు. కెప్టెన్‌  కోహ్లీతో విభేదాలే అందుకు కారణం.


Also Read: New Zealand Pakistan Tour: న్యూజిలాండ్ టీమ్ పర్యటన రద్దుతో పాక్ తక్షణ చర్యలు... స్టేడియంలో తనిఖీలు చేస్తున్న పాక్ దళాలు


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ తర్వాత కోచ్‌ రవిశాస్త్రి పదవీకాలం ముగుస్తోంది. మరో నెల రోజుల పాటు పదవీకాలాన్ని పొడగిస్తానన్నా ఆయన అంగీకరించడం లేదని తెలిసింది. బహుశా ఇంగ్లాండ్‌లో పుస్తకావిష్కరణ తర్వాత కొవిడ్‌ రావడం,  అనుమతి లేకుండా ఆయన బయట తిరగడంతో బీసీసీఐ ఆగ్రహించిందని తెలిసింది. పైగా ఆయన వయసు ఇప్పుడు 59 ఏళ్లు. కోచ్‌గా పనిచేయాలంటే 60 ఏళ్లలోపే ఉండాలి. దాంతో కోచింగ్‌ పదవి చేపట్టాలని బీసీసీఐ అనిల్‌ కుంబ్లేను కలిసిందని సమాచారం. లేదంటే వీవీఎస్‌ లక్ష్మణ్‌తో దరఖాస్తు చేయించాలని అనుకుంటోందని తెలిసింది.


Also Read: Rohit Sharma Captain: తన సత్తా ఏంటో చూపించాడు.. రోహిత్‌ కెప్టెన్సీకి పెరుగుతున్న మద్దతు


'అనిల్‌ కుంబ్లే నిష్క్రమణ తర్వాత టీమ్‌ఇండియాలో దిద్దుబాటు అవసరమైంది. విరాట్‌ కోహ్లీ ఒత్తిడి వల్ల కుంబ్లే బయటకు వచ్చినతీరు బాగాలేదు. తిరిగి కోచ్‌ పదవి చేపట్టేందుకు కుంబ్లే అంగీకరిస్తారా? వీవీఎస్‌ లక్ష్మణ్‌ సిద్ధంగా ఉన్నారా చూడాలి' అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.


ఏదేమైనా కోచ్‌గా భారత వ్యక్తికే బీసీసీఐ ప్రాధాన్యం ఇవ్వనుంది. కుంబ్లే, లక్ష్మణ్‌ వందకు పైగా టెస్టులు ఆడారు. భారత క్రికెట్లో వారికి మంచి గుర్తింపు ఉంది. పైగా వారిద్దరికీ కోచింగ్‌ ఇచ్చిన అనుభవం ఉంది. కుంబ్లే టీమ్‌ఇండియా, పంజాబ్‌ కింగ్స్‌కు కోచ్‌గా పనిచేశాడు. సన్‌రైజర్స్‌కు లక్ష్మణ్‌ సుదీర్ఘకాలంగా మెంటార్‌గా ఉన్నాడు. బెంగాల్‌ రంజీ జట్టుకు సలహాదారుగా పనిచేస్తున్నాడు. అందుకే విదేశీ కోచ్‌గా రెండో ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది.


Also Read: Rohit Sharma: డ్రెస్సింగ్‌ రూమ్‌లో భగ్గుమన్న విభేదాలు.. రోహిత్‌ను వైస్‌ కెప్టెన్సీ నుంచి తప్పించాలన్న కోహ్లీ!


'మంచి అనుభవం, స్థాయి ఉన్న వాళ్లకే బీసీసీఐ ప్రాధాన్యం ఇవ్వనుంది. కోచ్‌ లేదా మెంటార్‌గా అనుభవం ఉన్నవాళ్లు కోచ్‌ పదవికి దరఖాస్తు చేయొచ్చు. వారిలో మెరుగైన రికార్డు ఉన్నవారినే బీసీసీఐ ఎంపిక చేస్తుంది' అని బోర్డు వర్గాలు అంటున్నాయి.


ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ కోచ్‌ పదవికి పోటీలో ఉన్నారా అని ప్రశ్నించగా 'ఆయన దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ భారత జట్టు ప్రధాన కోచ్‌ స్థాయి ఆయనకు ఉందని అనుకోవడం లేదు. సహాయ కోచ్‌గా ఆయన అత్యుత్తమంగా పనిచేశారు. ఏదేమైనా కొత్త కోచ్‌ తనకు నచ్చిన సహాయ బృందాన్ని ఎంపిక చేసుకుంటాడు' అని తెలిపారు.