టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ రాణిస్తాడని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ అంటున్నాడు. అతనిప్పటికే కెప్టెన్‌గా నిరూపించుకున్నాడని వెల్లడించాడు. విరాట్ కోహ్లీ సారథ్యానికి దూరమవ్వాలని నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నాడు.
'భారత టీ20 జట్టు తర్వాతి కెప్టెన్‌గా రోహిత్ శర్మ అన్ని విధాలా అర్హుడే. జట్టుకు నాయకత్వం వహించేందుకు అవకాశం ఇచ్చిన ప్రతిసారీ తనేంటో నిరూపించుకున్నాడు'అని వెంగీ అన్నాడు.
'2018లో టీమ్‌ఇండియా రోహిత్ సారథ్యంలోనే ఆసియాకప్ గెలిచింది. అంతేకాకుండా అతడు ముంబయి ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించాడు. గొప్ప సారథిగా నిరూపించుకున్నాడు' అని వెంగీ పేర్కొన్నాడు.
మాజీ క్రికెటర్, సెలక్టర్ సందీప్ పాటిల్ సైతం వెంగ్ సర్కార్ అభిప్రాయంతో ఏకీభవించాడు. రోహిత్‌శర్మకు నాయకత్వ పరంగా అనుభవం ఉందని వెల్లడించాడు. అవకాశం ఇచ్చిన ప్రతిసారీ అతడు నిరూపించుకున్నాడని తెలిపాడు. ముంబయి ఇండియన్స్‌ను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడని ప్రశంసించాడు. 'అవును, రోహిత్ తనలో సత్తా ఉందని నిరూపించుకున్నాడు' అని పాటిల్ పేర్కొన్నాడు.
టీమ్‌ఇండియా పొట్టి క్రికెట్ సారథ్యం నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ తర్వాత అతడు మరొకరికి పగ్గాలు అప్పగిస్తానని చెప్పాడు. దాంతో తర్వాతి కెప్టెన్ ఎవరా? అన్న చర్చలు మొదలయ్యాయి. ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నా రోహిత్‌శర్మకే ఎక్కువమంది మాజీలు మద్దతు ఇస్తున్నారు. ముంబయికి అతడు ఐదు ట్రోఫీలు అందించడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.
కోహ్లీ నిర్ణయానికి సునిల్ గావస్కర్ సైతం మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్నెల్లుగా అతడి సారథ్యంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నాడు. భవిష్యత్తు సారథిగా కేఎల్ రాహుల్‌ను తయారు చేయాలని సూచించాడు.
'టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్సీ చేస్తానని కోహ్లీ ప్రస్తావించాడు. అయితే అతడి వన్డే సారథ్యంపై నిర్ణయం తీసుకొనేది సెలక్టర్లే. టెస్టు నాయకత్వంపై మాత్రం ప్రశ్నల్లేవు. వన్డేల్లో సారథ్య మార్పులుంటాయా లేదా చూడాలి' అని గావస్కర్ అన్నాడు. బీసీసీఐ భారత క్రికెట్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తోందని సన్నీ పేర్కొన్నాడు. అలా చేయడం మంచిదేనని వెల్లడించాడు. మున్ముందు నాయకత్వ బదిలీ సాఫీగా సాగేందుకు కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్ చేయాలని ఈ క్రికెట్ దిగ్గజం సూచిస్తున్నాడు.
'ఒకవేళ భారత్ భవిష్యత్తు సారథి తయారు చేయాలనుకుంటే కేఎల్ రాహుల్ వైపు చూడటం మంచిది. అతడు బాగా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్‌లోనూ అతడి బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. ఐపీఎల్‌లోనూ అతడు భీకరంగా ఆడుతున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో దుమ్మురేపుతున్నాడు. అందుకే అతడిని వైస్ కెప్టెన్ చేస్తే చేయాలి. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌ను అతడు మెరుగ్గా నడిపిస్తున్నాడు' అని సన్నీ తెలిపాడు.