2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే రాష్ట్ర విమోచన దినాన్ని ఘనంగా నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. తెలంగాణ ప్రజలందరికీ ఆయన విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నినాదం నిర్మల్ నుంచి హైదరాబాద్ వరకూ వినిపించాలని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం నిర్మల్‌లో తెలంగాణ బీజేపీ నిర్వహించిన  తెలంగాణ విమోచన సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా విమోచన దినోత్సవం నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.


బీజేపీ ప్రభుత్వం రాగానే అధికారికంగా విమోచన దినం
‘‘తెలంగాణ ప్రజలందరికీ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ప్రధాని మోదీ పుట్టిన రోజు కూడా. ఆపరేషన్ పోలో కూడా ఇవాళే సమాప్తమైంది. మన నినాదం నిర్మల్ నుంచి హైదరాబాద్ వరకూ వినిపించాలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలలకు గానీ తెలంగాణకు స్వాతంత్ర్యం రాలేదు. ఫ్యూడల్ పాలన నుంచి విముక్తి సాధించిన ఈ రోజును తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం లేదు. కేసీఆర్ ఈ రోజును ఎందుకు జరపడం లేదో చెప్పాలి. 2021 తర్వాత తెలంగాణలో బీజేపీ కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ వెంటనే అధికారికంగా హైదరాబాద్ సంస్థానం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతాం. మజ్లిస్ పార్టీకి బీజేపీ ఏ మాత్రం భయపడదు. ఆనాడు సర్దార్ పటేల్ పరాక్రమం కారణంగానే తెలంగాణ విమోచనం జరిగింది.’’


Must Watch: నిజాం లొంగుబాటు.. 1948లోని వార్తలు ఎక్స్‌క్లూజివ్‌గా.. ఆ రోజు పత్రికల్లో ఏం వచ్చింది?


ఎవరికి భయపడుతున్నారు?: అమిత్ షా
‘‘తెలంగాణ విమోచన దినం ఎందుకు జరపరు. అటు మహారాష్ట్ర అధికారికంగా జరుపుకుంటోంది. కర్ణాటక కూడా జరుపుతోంది. కానీ తెలంగాణలో మాత్రం విమోచన దినం జరపడం లేదు. మీరు ఎవరికి భయపడుతున్నారు చెప్పండి? ముఖ్యమంత్రి గారూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ఆదివాసీలు మీకు గుర్తు లేరా? వారి త్యాగం ఒట్టిగా పోదు. మేం 2024లో అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినం జరిపి తీరుతాం’’ అని అమిత్ షా ప్రసంగించారు.


ఈటల రాజేందర్‌ను గెలిపించాలి
‘‘తెలంగాణలోని ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల కోసం మా పోరాటం కొనసాగుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో లోక్‌సభ సీట్లన్నీ మేమే గెలుస్తాం. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ చివరి దశకు చేరుకుంది. మజ్లీస్‌ను ఓడిస్తేనే తెలంగాణకు అసలైన స్వేచ్ఛ. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. బీజేపీ మాత్రమే మజ్లిస్‌తో పోరాడగలదు. మన నినాదాలు హైదరాబాద్‌ వరకు వినపడాలి హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపించండి’’ అని అమిత్‌ షా పిలుపునిచ్చారు.


Also Read: Bandi Sanjay: నా వయసు మోదీ, అమిత్‌షాకి ట్రాన్స్‌ఫర్ చేయాలని అమ్మవారికి మొక్కుకున్నా.. బండి సంజయ్ వ్యాఖ్యలు