భద్రత కారణాల(Security Alert) దృష్ట్యా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనను విరమించుకుంది. దీంతో పాకిస్తాన్ తక్షణ చర్యలు ప్రారంభించింది. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, పాకిస్తాన్ భద్రతా దళాలు స్టేడియంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. న్యూజిలాండ్ శుక్రవారం పాకిస్థాన్‌తో రావల్పిండిలో జరిగే మూడు వన్డేలలో మొదటి మ్యాచ్ ఆడాల్సి ఉంది. తరువాత లాహోర్‌లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్ కూడా ఉంది. కానీ అనూహ్యంగా న్యూజిలాండ్ పాక్ పర్యటనను రద్దుచేసుకుంది. 


 






అసలేం జరిగిందంటే...


పాకిస్తాన్‌కు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు గట్టి షాక్ ఇచ్చింది. భద్రతా కారణాలను చూపిస్తూ పాకిస్తాన్‌లో జరగాల్సిన తమ సిరీస్‌ను రద్దు చేసుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు న్యూజిలాండ్ ఈ ప్రకటన చేయడం క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉంది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సరిగ్గా మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు న్యూజిలాండ్ ఈ వన్డేను ఆడబోవడం లేదని ప్రకటించింది.


ఏకపక్ష నిర్ణయం


న్యూజిలాండ్ ప్రభుత్వం అందించిన సెక్యూరిటీ అలెర్ట్ కారణంగా బ్లాక్ క్యాప్స్ పాకిస్తాన్ టూర్‌ను ఆడబోవడం లేదని న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రకటనలో పేర్కొంది. ఆటగాళ్ల భద్రతే తమకు ముఖ్యమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ తెలిపారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఈ నిర్ణయం ఎంత బాధ పెట్టి ఉంటుందో తమకు తెలుసని, వారి ఆతిథ్యం కూడా అద్భుతంగా ఉందని డేవిడ్ పేర్కొన్నారు. తమకు ఇది తప్ప మరో ఆప్షన్ కనిపించలేదన్నారు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందిస్తూ.. ఇది ఏకపక్ష నిర్ణయం అని తెలిపింది.


 చివరి నిముషంలో 


భద్రతా కారణాలను చూపిస్తూ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ తమకు ఈరోజే సమాచారం అందించిందని పీసీబీ తన మీడియా ప్రకటనలో పేర్కొంది. తమ దేశానికి వచ్చే అన్ని జట్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ ప్రభుత్వం అత్యుత్తమ భద్రతను అందిస్తుందని తెలిపింది. తాము న్యూజిలాండ్ క్రికెట్‌కు కూడా ఇదే చెప్పామని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి, న్యూజిలాండ్ ప్రధానమంత్రితో స్వయంగా మాట్లాడారని, ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంటెలిజెన్స్ వ్యవస్థల్లో తమది కూడా ఒకటని, న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఎటువంటి ముప్పూ లేదని చెప్పారన్నారు.