టీమ్‌ఇండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీని మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ విమర్శించాడు. ఓటమి తర్వాత మీడియా ముందుకు జస్ప్రీత్ బుమ్రాను పంపించడమేంటని ప్రశ్నించాడు. ఒకట్రెండు మ్యాచుల్లో ఓడిపోవడం తప్పేమీ కాదన్నాడు. పరాజయం తర్వాత శాస్త్రి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తే బాగుండేదని వెల్లడించాడు. ఏబీపీ న్యూస్‌తో అజ్జూ మాట్లాడాడు.
'నా దృష్టిలోనైతే మీడియా సమావేశానికి కోచ్ రావాలి. ఒకవేళ విరాట్ కోహ్లీ మీడియా ముందుకు రావొద్దనుకుంటే ఫర్వాలేదు. కానీ రవిభాయ్ కచ్చితంగా రావాల్సింది. కేవలం గెలిచిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్సులకు హాజరైతే సరిపోదు. ఓటములకూ వివరణ ఇవ్వాలి. న్యూజిలాండ్ ఓటమి తర్వాత బుమ్రాను మీడియా ముందుకు పంపించడం సరికాదు. కనీసం కోచింగ్ బృందంలోనైనా ఒకరు రావాల్సింది' అని అజ్జూ అన్నాడు.
ఒకట్రెండు మ్యాచుల్లో ఓటమి పాలైతే సిగ్గుపడాల్సిన అవసరం లేదని అజహర్ అన్నాడు. అన్ని ప్రశ్నలకు బుమ్రాతోనే సమాధానాలు చెప్పించాలనుకోవడం సరికాదన్నాడు. ఈ కఠిన సమయంలో ఎవరో ఒకరు ముందడుగు వేయాలని సూచించాడు. 'ఒకటి, రెండు మ్యాచుల్లో పరాభవానికి సిగ్గుపడొద్దు. కానీ జట్టు ఎందుకు ఓడిపోయిందో కెప్టెన్ లేదా కోచ్ ప్రజలకు వివరించాలి. బుమ్రా నుంచి జవాబులను ఎలా ఆశిస్తాం చెప్పండి? గెలిచినప్పుడు మాట్లాడేందుకు సిద్ధంగా ఉండేవాళ్లు ఓడిపోయినప్పుడు, కఠిన సందర్భాల్లోనూ ముందుకు రావాలి' అని అజ్జూ పేర్కొన్నాడు.
Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి