కాలం గడిచే కొద్దీ ద్వైపాక్షిక పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసులు ప్రాధాన్యం కోల్పోతున్నాయని టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రి అంటున్నాడు. టీ20 క్రికెట్‌ సైతం ఫుట్‌బాల్‌ బాటను అనుసరించాలని సూచించాడు. ఎక్కువగా ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడించాలని పేర్కొన్నాడు. కోచ్‌గా తన కెరీర్లో ఒక్క వన్డే, టీ20 మ్యాచునూ గుర్తు పెట్టుకోలేదని వెల్లడించాడు. జస్ప్రీత్‌ బుమ్రాను ఉద్దేశపూర్వకంగానే భారత్లో టెస్టు క్రికెట్‌ ఆడించలేదని స్పష్టం చేశాడు.


'నేనైతే అత్యంత తక్కువగా ద్వైపాక్షిక టీ20 క్రికెట్‌ చూడాలని అనుకుంటున్నా. ఓసారి ఫుట్‌బాల్‌ను వీక్షించండి. ప్రీమియర్‌ లీగ్‌, స్పానిష్‌ లీగ్‌, ఇటాలియన్‌ లీగ్‌, జర్మన్‌ లీగ్‌ వంటివి ఉన్నాయి. ఛాంపియన్స్‌ లీగ్‌ మొదలవ్వగానే ఆటగాళ్లంతా ఒక్కటవుతారు. కొన్నే ద్వైపాక్షిక ఫుట్‌ బాల్‌ మ్యాచులు ఉంటాయి' అని శాస్త్రి అన్నాడు.


Also Read: IPL 2021 Phase 2: 'పిక్చర్‌ అభీ బాకీ హై'.. సవాళ్లు విసురుకున్న కోహ్లీ, రోహిత్‌!


ఫుట్‌బాల్‌ జాతీయ జట్లు ఎక్కువగా ప్రపంచకప్‌, ప్రపంచకప్‌ అర్హత మ్యాచులు, కీలకమైన యురోపియన్‌ ఛాంపియన్‌షిప్స్‌, కోపా అమెరికా, ఆఫ్రికా కప్‌ ఆఫ్‌ నేషన్స్‌ వంటివి మాత్రమే ఆడతాయని రవిశాస్త్రి పేర్కొన్నాడు. టీ20లు సైతం అదే బాటలో పయనించాల్సిన అవసరం ఉందన్నాడు. వేర్వేరు దేశాల్లోకి క్రికెట్‌ను విస్తరించాలని, ఒలింపిక్స్‌లో ఆడాలని సూచించాడు. ద్వైపాక్షిక సిరీసులు తగ్గించి ఆటగాళ్లకు విశ్రాంతి నివ్వాలన్నాడు. దాంతో టెస్టు క్రికెట్‌ ఆడేందుకు వారికి విశ్రాంతి దొరుకుతుందని తెలిపాడు.


Also Read: CSK vs MI: మాపై ముంబయిదే పైచేయి.. అంగీకరించిన సీఎస్‌కే కోచ్‌ ఫ్లెమింగ్‌


'ఫ్రాంచైజీ క్రికెట్‌ సూపర్‌హిట్‌ అయింది. అవి బాగా చూస్తున్నప్పుడు ద్వైపాక్షిక సిరీసులతో పనేముంది? టీమ్‌ఇండియా కోచ్‌గా ఏడేళ్ల కాలంలో నేనొక్క వన్డే, టీ20ని గుర్తుంచుకోలేదు. ప్రపంచకప్‌ లాంటివే గుర్తుంటాయి. కోచ్‌గా నేనా ఒక్కటే సాధించలేదు. అది మినహాయిస్తే ప్రపంచమంతా గెలిచేశాం. విదేశాల్లో వన్డే, టీ20 సిరీసు విజయాలను ఎవరూ గుర్తుంచుకోరు. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌పై గెలిచిన టెస్టులు ఎలా గుర్తున్నాయో చూడండి' అని రవిశాస్త్రి అన్నాడు.


Also Read: CSK vs MI: పంతం నీకా నాకా హై..! చివరి 5లో 4 ముంబయివే.. రోహిత్‌, ధోనీలో నేడు గెలిచేదెవరు?


దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసును త్రుటిలో కోల్పోయినప్పుడు 20 వికెట్లు తీసే ఫాస్టుబౌలర్లు ఉండాలని గ్రహించానని శాస్త్రి చెప్పాడు. అందుకే జస్ప్రీత్‌ బుమ్రాను స్వదేశంలో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేయించలేదని తెలిపాడు. 'జస్ప్రీత్‌ టెస్టు క్రికెట్‌ ఆడతాడని ఎవరూ ఊహించలేదు. అతనో పరిమిత ఓవర్ల బౌలర్‌. కానీ నేను కోచ్‌గా ఎంపికయ్యాక విదేశాల్లో 20 వికెట్లు ఎలా తీయాలో అని  ప్రశ్నించుకున్నాను. నలుగురు గొప్ప ఫాస్ట్‌ బౌలర్లు అవసరమని గ్రహించాను. ఎందుకంటే నేను వెస్టిండీస్‌పై ఎక్కువగా టెస్టు సిరీసులు ఆడాను. అందుకే అతడిని స్వదేశంలో ఆడించొచ్చని భావించాను. విరాట్‌కు మూడేళ్ల క్రితమే ఈ సంగతి చెప్పాను. సమయం రాగానే బుమ్రాతో అరంగేట్రం చేయించాను' అని అతడు వెల్లడించాడు.