మూడో టెస్టు నాలుగో రోజు లంచ్ తర్వాత కోహ్లీసేన వ్యూహాలు చెత్తగా ఉన్నాయని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీతో బౌలింగ్ చేయించకపోవడంలో అర్థం లేదన్నాడు. సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించాలన్న కల ఇప్పుడు పీడ కలగా మారిపోయిందని కఠినంగా అన్నాడు.
'లంచ్ తర్వాత టీమ్‌ఇండియా వ్యూహాలు నన్ను బిత్తరపోయేలా చేశాయి. ఆఖరి అవకాశంలో గట్టిగా పోరాడతారనే ఎవరైనా అనుకుంటారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమితో బౌలింగ్ చేయాలని భావిస్తారు. ఎందుకంటే విరామం తర్వాత బ్యాటర్లు క్రీజులో కుదురుకొనేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి సమయంలో వికెట్లు తీయొచ్చు. ఏదేమైనా దక్షిణాఫ్రికాలో తొలి సిరీస్ విజయం సాధించాలన్న కల ఇప్పుడు పీడకలగా మారిపోయింది' అని సన్నీ అన్నాడు.
'ఏమని చెప్పాలి! దక్షిణాఫ్రికా సాధించిన రెండు విజయాలు సమగ్రంగా ఉన్నాయి. జొహానెస్ బర్గ్, కేప్‌టౌన్‌లో ఏడు వికెట్ల తేడాతో సఫారీలు గెలిచారు' అని గావస్కర్ పేర్కొన్నాడు. సెంచూరియన్‌లో టీమ్‌ఇండియా విజయం చూసి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేస్తారని భావించానన్నాడు. ఆ కలలన్నీ చెదిరిపోయాయని పేర్కొన్నాడు.
'తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటను చూస్తే టీమ్‌ఇండియాతో పోరాడగలరా అనిపించింది. తర్వాతి రెండింట్లో కోహ్లీసేనదే విజయం అనుకున్నాను. కానీ సఫారీలు రెండు మ్యాచుల్లో గెలిచేశారు. తొలి టెస్టులో ఆధిపత్యం చెలాయించిన టీమ్‌ఇండియా 3-0తో గెలవడం ఖాయం అనుకున్నా. ఎందుకంటే దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్‌లో డెప్త్ లేదు. పైగా ఆన్రిచ్ నార్జ్ ఆడకపోవడం టీమ్‌ఇండియా సానుకూలం అవుతుందనుకున్నా. ఎందుకంటే ఆ జట్టులో ఇద్దరు అనుభవం లేని పేసర్లు ఉన్నారు' అని సన్నీ అన్నాడు.
కేప్‌టౌన్ టెస్టులో 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆడుతూ పాడుతూ మ్యాచ్ గెలిచేసింది. భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను ఏ దశలోనూ ఇబ్బంది పెట్టలేకపోయారు. బుమ్రా, షమి, శార్దూల్ ఠాకూర్‌లకు తలో వికెట్ దక్కింది. కీగన్ పీటర్సన్ (82: 113 బంతుల్లో, 10 ఫోర్లు), వాన్ డర్ డసెన్ (41 నాటౌట్: 95 బంతుల్లో, మూడు ఫోర్లు), తెంబా బవుమా (32 నాటౌట్: 58 బంతుల్లో, ఐదు ఫోర్లు), డీన్ ఎల్గర్ (30: 96 బంతుల్లో, మూడు ఫోర్లు) రాణించారు.
Also Read: IND vs SA, 3rd Test: కోహ్లీ.. స్టంప్‌మైక్ వద్ద ఆ మాటలేంటి? ఇంకేం ఆదర్శంగా ఉంటాడని గౌతీ విమర్శ
Also Read: IND vs SA: 1 గెలిచి 2 ఓడటం: మనకిదేం కొత్త కాదు బాబూ.. ఓసారి వెనక్కి వెళ్లండి!!
Also Read: IND vs SA ODI Series Schedule: టెస్టు సిరీసు పోయింది! ఇక వన్డేల్లోనైనా గెలుస్తారా? షెడ్యూలు ఇదే