పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మాత్రమే తమ లక్ష్యం కాదని వెల్లడించాడు. ఇకపై ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌నూ లక్ష్యంగా ఎంచుకుంటామని ప్రకటించాడు. ఎలాంటి భద్రతా లోపాలు లేకున్నా వారు పర్యటనలు రద్దు చేసుకున్నారని పేర్కొన్నాడు. మెగా టోర్నీలో తమ ఆటగాళ్లంతా కసిగా ఆడతారని స్పష్టం చేశాడు.
'పాక్ పర్యటన నుంచి ఇంగ్లాండ్ తప్పుకోవడం నిరాశపరిచింది. పశ్చిమ దేశాల కూటమి మళ్లీ ఒక్కటైంది. మాకు కోపం వస్తోంది. ఎందుకంటే ఎలాంటి ముప్పు పొంచివుందో చెప్పకుండానే న్యూజిలాండ్ వెళ్లిపోయింది. ఆంగ్లేయులు తప్పుకుంటారనని మేం ముందుగానే ఊహించాం. ఇది మాకో పాఠం. ఎందుకంటే వారు మా దేశంలో పర్యటించినప్పుడు గారాబంగా చూసుకుంటున్నాం. కానీ మేం వారి దేశాలకు వెళ్లినప్పుడు కఠిన క్వారంటైన్ అనుభవించాం. ఇప్పట్నుంచి మా ప్రయోజనాల మేరకే నడుచుకుంటాం' అని రమీజ్ అన్నాడు.
క్రికెట్ ప్రపంచం తమ దేశాన్ని పట్టించుకోకపోయినా ముందుకు సాగుతామని రమీజ్ తెలిపాడు. 'న్యూజిలాండ్, ఇంగ్లాండ్ చేసిన పనితో ఇప్పుడు వెస్టిండీస్‌పై ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా పునరాలోచనలో పడింది. ఇంగ్లాండ్, ఆసీస్, న్యూజిలాండ్ ఒక కూటమి. వీరిపై ఎవరికి ఫిర్యాదు చేయగలం. మేం వారిని మా వాళ్లుగా భావించాం. కానీ వాళ్లు అలా అనుకోలేదు. పీఎస్‌ఎల్ కోసం ఆ దేశ ఆటగాళ్లు ఇక్కడికొచ్చినప్పుడు సౌకర్యంగా ఉంటారు. ఒకే జట్టుగా ఆడినప్పుడు మాత్రం పాక్‌పై వారి మనసు మారుతుంది' అని విమర్శించాడు.
Also Read: Mithali Raj Record: వారెవ్వా మిథాలీ.. అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులతో రికార్డు
ఇప్పుడు తమకు వస్తున్న కోపాన్ని తమ ప్రదర్శనలో చూపిస్తామని రమీజ్ వెల్లడించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో కసిగా ఆడతామని వెల్లడించాడు. 'మెగా టోర్నీలో పొరుగుదేశం టీమ్‌ఇండియా ఒక్కటే మా లక్ష్యం కాదు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ రూపంలో మాకు మరో ఇద్దరు శత్రువులు తోడయ్యారు. మేం వారిని వదిలిపెట్టం. ఎందుకంటే వారు మా పట్ల సరైనతీరులో నడుచుకోలేదు. అందుకే మైదానంలో తప్పక మేం పగ తీర్చుకుంటాం' అని ఆయన స్పష్టం చేశాడు