అనుకున్నదే జరిగింది! అభిమానులు ఆశించినట్టుగానే సిక్సర్ల వర్షం కురిసింది. బౌండరీల వరద పారింది. దుబాయ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ అసలు సిసలు టీ20 క్రికెట్ మజా అందించారు. బ్యాటర్లు పరుగులతో దుమ్మురేపుతే.. బౌలర్లు అంతకుమించిన కిక్కు ఇచ్చారు. కీలకమైన ఈ మ్యాచులో రాజస్థాన్ ఉత్కంఠకర విజయం అందుకుంది. ఆ జట్టు నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆఖర్లో పంజాబ్ బోల్తా పడింది.
మయాంక్ అగర్వాల్ (67; 43 బంతుల్లో 7x4, 2x6), కేఎల్ రాహుల్ (49; 33 బంతుల్లో 4x4, 2x6) పోరాటంతో అత్యంత సునాయాసంగా గెలవాల్సిన పోరును చేజేతులా వదులుకుంది. యువ పేసర్‌కార్తీక్ త్యాగీ ఆఖరి 3 బంతుల్లో 3 పరుగులు అవసరమైన సమయంలో రెండు వికెట్లు తీసి తిరుగులేని విక్టరీ అందించాడు. అంతకు ముందు రాజస్థాన్‌లో యశస్వీ జైశ్వాల్ (49; 36 బంతుల్లో 6x4, 2x6), మహిపాల్ లోమ్రర్ (43; 17 బంతుల్లో 2x4, 4x6) రాణించారు.
Also Read: Mithali Raj Record: వారెవ్వా మిథాలీ.. అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులతో రికార్డు
చేతికందిన మ్యాచ్‌ను..
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని పంజాబ్ సునాయసంగా ఛేదించేలా కనిపించింది. ఆ జట్టు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం అందించారు. తొలుత రాహుల్ తన క్లాస్ టచ్‌తో అలరించారు. వరుసగా బౌండరీలు, సిక్సర్లు బాదేశాడు. మరికాసేపటికే మయాంక్ స్ట్రెయిట్ షాట్లతో మురిపించాడు. సహచరుడి కన్నా ముందే అర్ధశతకం బాదేశాడు. కానీ వీరిద్దరూ ఆరు పరుగుల తేడాతో వెనుదిరిగారు. నికోలస్ పూరన్ (32; 22 బంతుల్లో 1x4, 2x6), అయిడెన్ మార్‌క్రమ్ (26*; 20 బంతుల్లో 2x4, 1x6) దూకుడుగా ఆడటంతో ఆఖరి ఓవర్లో 4 పరుగులే చేయాల్సిన పరిస్థితి. కానీ కార్తీక్ త్యాగీ అద్భుతం చేశాడు. వేగం తగ్గించి బంతులేశాడు. మూడో బంతికి పూరన్, ఐదో బంతికి హుడా (0; 2 బంతుల్లో)ను ఔట్ చేశాడు. ఆఖరి బంతికీ పరుగులివ్వలేదు. దాంతో రాజస్థాన్ 2 పరుగుల తేడాతో విజయం అందుకుంది.
జైశ్వాల్ కేక
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఏకంగా 200+ పరుగులు చేసేలా కనిపించింది. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ (49; 36 బంతుల్లో 6x4, 2x6), ఎవిన్ లూయిస్ (36; 21 బంతుల్లో 7x4, 1x6) బ్యాటింగే ఇందుకు కారణం. వీరిద్దరూ ఓవర్‌కు పది పరుగులు చొప్పున చేశారు. తొలి వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా లూయిస్ తన సీపీఎల్ ఫామ్‌ను కొనసాగించాడు. అతడిని ఔట్ చేయడం ద్వారా అర్షదీప్ పంజాబ్‌కు బ్రేక్ ఇచ్చాడు. మరికాసేపటికే సంజు శాంసన్ (4) ఇషాన్ పోరెల్ ఔట్ చేశాడు. ఈ క్రమంలో లియామ్ లివింగ్‌స్టన్ (25; 17 బంతుల్లో 2x4, 1x6) అండతో జైశ్వాల్ రెచ్చిపోయాడు. కీలకమైన అతడిని హర్‌ప్రీత్ జట్టు స్కోరు 136 వద్ద ఔట్ చేశాడు. కానీ మహిపాల్ లోమ్రర్ (43; 17 బంతుల్లో 2x4, 4x6) రెచ్చిపోవడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. 18వ ఓవర్లో అర్షదీప్ అతడిని ఔట్ చేయడంతో జోరు తగ్గింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో రియాన్ పరాగ్ (4), రాహుల్ తెవాతియా (2), మోరిస్ (5) త్వరగానే ఔటయ్యారు.