బెంగళూరుతో మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, కోల్‌కతా తన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లో పైచేయి సాధించిన కోల్‌కతా అలవోకగా విజయం సాధించింది. బెంగళూరు తరఫున దేవ్‌దత్ పైడిక్కల్ మినహా ఎవరూ 20 పరుగులు కూడా దాటలేదు. కోల్‌కతా బౌలర్లు వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్ మూడేసి వికెట్లు తీసి బెంగళూరును కోలుకోనివ్వకుండా చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (48: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), వెంకటేష్ అయ్యర్ (41: 29 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) బెంగళూరు బౌలర్లను చీల్చి చెండాడుతూ మొదటి వికెట్‌కు 82 పరుగులు జోడించారు. విజయానికి ముంగిట గిల్ అవుటైనా.. అదే ఓవర్‌లో వెంకటేష్ మ్యాచ్ ముగించాడు.


ఘోరంగా విఫలమైన బెంగళూరు బ్యాటింగ్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు-ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. విరాట్ కోహ్లీని (5: 3 బంతుల్లో, ఒక ఫోర్) అవుట్ చేసి ప్రసీద్ కృష్ణ కోల్‌కతాకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. అనంతరం దేవ్‌దత్ పడిక్కల్ (22: 20 బంతుల్లో, మూడు ఫోర్లు), తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్(16: 19 బంతుల్లో, ఒక ఫోర్) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే టచ్‌లోకి వస్తున్నట్లు కనిపించగానే పడిక్కల్‌ను లోకి ఫెర్గూసన్ అవుట్ చేశాడు.


ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో శ్రీకర్ భరత్‌, డివిలియర్స్‌ను (0, 1 బంతి) అవుట్ చేసి రసెల్ కోల్‌కతాకు పెద్ద బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి కూడా వరుస బంతుల్లో మ్యాక్స్‌వెల్(10:17 బంతుల్లో), హసరంగ(0:1 బంతి) అవుట్ చేయడంతో బెంగళూరు 63 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా ఎక్కడా బెంగళూరు వికెట్ల పతనం ఆగలేదు. దీంతో 19 ఓవర్లలో 92 పరుగులకు ఆర్సీబీ ఆలౌట్ అయింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్ మూడేసి వికెట్లు తీయగా, లోకి ఫెర్గూసన్ రెండు వికెట్లు, ప్రసీద్ కృష్ణ ఒక వికెట్ తీశారు.


అస్సలు తడబడకుండా..
ఛేదన కోల్‌కతా ఎక్కడా తడబడలేదు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (48: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), వెంకటేష్ అయ్యర్ (41: 29 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) మొదటి వికెట్‌కు 82 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. ఒక్క బెంగళూరు బౌలర్ కూడా ఈ జోడిని ఇబ్బంది పెట్టలేదు. పదో ఓవర్‌ మొదటి బంతికి చాహల్ గిల్‌ను అవుట్ చేయగా.. అదే ఓవర్‌లో వెంకటేష్ మూడు ఫోర్లు బాది లాంఛనాన్ని పూర్తి చేశాడు.


60 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్ చరిత్రలో ఇది ఐదో అత్యధికం కావడం విశేషం. ముంబై(87 బంతులు), కొచ్చి టస్కర్స్ కేరళ(76 బంతులు), పంజాబ్ కింగ్స్ (73 బంతులు), బెంగళూరు (71 బంతులు) ఈ జాబితాలో ముందంజలో ఉన్నారు. ఈ గెలుపుతో కోల్‌కతా తన నెట్‌రన్‌రేట్‌ను కూడా బాగా మెరుగుపరుచుకుంది.