Dhinidhi Desinghu Indias Youngest Olympian: ఒలింపిక్స్... ఒక్కసారైనా పాల్గొనాలని... దిగ్గజ ఆటగాళ్ల ప్రదర్శలను కళ్లారా చూడాలని... తమ దేశానికి ప్రాతినిథ్యం వహించాలని ఎందరో అథెట్లు అహోరాత్రులు కనే కల. అయినా ఎన్నో అడ్డంకులు దాటితే కానీ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించడం సాధ్యం కాదు. ట్రయల్స్ అనీ... ఒలింపిక్స్ అర్హత పోటీలనీ.. ఇలా చాలా అడ్డంకులను దాటి ఒలింపిక్స్ కలను సాకారం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఓ 14 ఏళ్ల బాలిక.. ఇప్పుడు భారత్‌కు విశ్వ క్రీడల్లో ప్రాతినిథ్యం వహిస్తోంది. నీటి కొలనులో సొర చేపలా దూసుకుపోయే ఈ చిచ్చరపిడుగు ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది. పతకం ఆశలు లేకపోయినా.. ఇంత పిన్న వయసులో స్విమ్మింగ్‌లో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ధీనిధి దేశింగు(Dhinidhi Desinghu) చరిత్ర సృష్టిస్తుందేమో చూద్దాం...
అతి పిన్న వయస్కురాలు...
పారిస్ గేమ్స్‌లో భారత్ తరపున బరిలోకి దిగుతున్న అతి పిన్న వయస్కురాలిగా 14 ఏళ్ల ధినిధి దేశింగు రికార్డు సృష్టించింది. టీనేజ్ స్విమ్మింగ్ సంచలనం ధీనిధి దేశింగు... పారిస్ ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేయనుంది. 14 ఏళ్ల ధీనిధి యూనివర్సాలిటీ కోటాలో మహిళల 200 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో ఒలింపిక్స్‌లో భారత్ తరపున బరిలోకి దిగనుంది. అసలు స్విమ్మింగ్ అంటేనే ఇష్టం లేని అమ్మాయి... ఇప్పుడు అదే స్విమ్మింగ్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించడం వెనక ఎన్నో ఏళ్ల కష్టం ఉంది. అసలు తనకు చిన్నతనంలో స్విమ్మింగ్ పూల్ అంటేనే ఇష్టం ఉండేది కాదని... ఆ తర్వాత అదే లోకంగా మారిపోయిందని ధీనిధి వెల్లడించింది. తనకు స్విమ్మింగ్ పూల్ నీరు నచ్చలేదని, అసలు అందులోకి దిగాలని అనుకోలేదని... తలను నీళ్లలో ముంచాలంటే ఆరంభంలో భయమేసిందని... కానీ వాటన్నింటినీ అధిగమించానని ధీనిధి చెప్పింది. ఆరేళ్ల వయసులో ప్రారంభమైన తన శిక్షణ ఇప్పటికీ ఓ గాడిన పడిందని తెలిపింది. తనను స్విమ్మింగ్ పూల్‌లోకి దించేందుకు అమ్మానాన్న కూడా అందులోకి దిగారని... వారితో పాటే తాను ఈత కొట్టానని ఆనాటి రోజులను ధీనిధి దేశింగు గుర్తు చేసుకుంది. బెంగుళూరులోని డాల్ఫిన్ ఆక్వాటిక్స్‌లో శిక్షణ పొందిన ధినిధి.. మొదట తనకు ఈ స్విమ్మింగ్ రూల్స్ ఏమీ అర్థం కాలేదని చెప్పింది. బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్, బటర్ ఫ్లై ఇవేమీ ఆరంభంలో తనకు తెలీదని అన్నారు.
తక్కువేం కాదు
జాతీయ క్రీడల్లో ధీనిధి చరిత్ర సృష్టించింది. అతి పిన్న వయసులోనే రికార్డులపై రికార్డులు సృష్టించింది. నేషనల్ గేమ్స్‌లో ఏకంగా ఏడు గోల్డ్ మెడల్స్ సాధించి ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలుగా రికార్డ్ సృష్టించింది. 200 మీటర్ల ఫ్రీస్టైల్ లో ధీనిధి దేశింగు నేషనల్ రికార్డును నెలకొల్పి ఔరా అనిపించింది. గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో కూడా సత్తా చాటి తన ప్రతిభను చాటింది. ఆమె పారిస్ ఒలింపిక్స్‌లో 200 మీటర్ల ఫ్రీస్టైల్‌లో కూడా ధీనిది దేశింగు పాల్గొంటుంది.