Nita Ambani ReElected as Member of IOC | న్యూఢిల్లీ/పారిస్: పారిస్ 2024 ఒలింపిక్ గేమ్స్ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) కీలక ప్రకటన చేసింది. రిలయన్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా మరోసారి ఎన్నికయ్యారు. పారిస్ లో జరగనున్న 142వ ఒలింపిక్ సెషన్ సందర్భంగా 100 శాతం ఓటింగ్ తో నీతా అంబానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఐఓసీ  బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. నీతా అంబానీ ప్రస్తుతం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో పర్యటిస్తున్నారు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకుగానూ నీతా అంబానీ పారిస్‌కు చేరుకున్నారని తెలిసిందే.


ఐఓసీ సభ్యురాలిగా మరోసారి ఎన్నికైన తర్వాత నీతా అంబానీ మీడియాతో మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా తిరిగి ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. రీ ఎలక్ట్ కావడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. నాపై విశ్వాసం  ఉంచిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ తో పాటు IOCలోని తోటి సభ్యులకు ధన్యవాదాలు. ఐఓసీ మెంబర్‌గా తిరిగి ఎన్నిక కావడం కేవలం వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు. క్రీడా రంగంపై భారతదేశంలో పెరుగుతున్న ప్రాధాన్యత, ప్రభావాన్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించడంగా భావిస్తాను. ఈ విషయాన్ని ప్రతి ఇండియన్‌తో ఆనందం, గర్వంగా పంచుకుంటున్నాను. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ గేమ్స్‌ను బలోపేతం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని’ చెప్పారు.






పారిస్‌లో నీతాకు ఘన స్వాగతం
పారిస్‌లో జరగుతున్న ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు నీతా అంబానీ హాజరయ్యారు. పారిస్‌కు వెళ్లిన నీతా అంబానీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఘన స్వాగతం పలికారు. నీతా అంబానీని అధ్యక్షుడు మేక్రాన్ గ్రాండ్ వెల్కమ్ పలికిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్రాన్స్ రాజధానిలో జరిగిన 142వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్ ప్రారంభోత్సవానికి నీతా అంబానీ హాజరయ్యారు. నీతా అంబానీ చేతిని ముద్దాడుతూ మేక్రాన్ ఆత్మీయ స్వాగతం పలికారు. రెడ్ కలర్ ఎంబ్రాయిడరీతో చేసిన సూట్‌ను నీతా అంబానీ ధరించారు. ఆమె డ్రెస్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.